విశ్రాంత ఉద్యోగి కుటుంబానికి రక్షణ కవచం పింఛను
వినుకొండలో పెన్షనర్ల దినోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, మక్కెన
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రతిఒక్క విశ్రాంత ఉద్యోగి కుటుంబానికి పింఛను రక్షణకవచం లాంటిదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెన్షనర్ల సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం వినుకొండ నరసరావుపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం భవనంలో పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రభుత్వ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. పెన్షనర్ల ఆరాధ్యదైవం డీఎస్ నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును పెన్షనర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఎన్నికల్లో పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామ న్నారు. కొంత సమయం తీసుకుని పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరతానని చెప్పారు. బకాయిలన్నీ వచ్చేలా కృషి చేస్తామన్నారు. జగన్‌రెడ్డి తగ్గించిన పెన్షన్‌ను మళ్లీ యథాతథంగా పెంచి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరతానని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అందరికీ పింఛనను హక్కుగా రావడానికి కారకులైన డీఎస్ నకరాను స్మరించుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. వినుకొండలో పెన్షనర్స్ మంచి భవనాన్ని నిర్మించుకుని, చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏటా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, గతంలో అనేకసార్లు తాను కూడా పాల్గొనడం జరిగిందన్నారు. సేవాభావంతో అన్నదాన కార్యక్రమాలు చేయడం, పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం లాంటివి చాలా నచ్చిన అంశమన్నారు. పెన్షన్లు రాని, కష్టాల్లో ఉన్నవారిపై మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా జగన్‌రెడ్డి పాలన రావడం జరిగిందన్నారు. పెన్షనర్లకు మేలు చేయకపోగా కీడు చేసిన వ్యక్తి జగన్‌రెడ్డి అని, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని, గుర్తుపెట్టుకోవడమే కాదు, ఇలాంటి దుర్మార్గుల గురించి ఇంటింటికీ బతికున్నంత కాలం చెప్పాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జి కృష్ణారెడ్డి, కే. కృష్ణమూర్తి, కె.వి. రాఘవయ్య, భువనగిరి సుబ్రహ్మణ్యం, వి గురవయ్య, ఎంవి. సుబ్బయ్య శర్మ, సిహెచ్ సుబ్బారావు, డి కొండయ్య, ఎం.వి శర్మ, ఆదినారాయణ, కోటయ్య, దుబ్బల దాసు, ఎం సామ్యూల్, వెంకటేశ్వర్లు ,జి నాగేంద్రుడు, పి సైదావలి, వై వెంకటస్వామి, ఏ అనంత రమేష్, శేషయ్య, తదితరులు పాల్గొన్నారు. (Story : విశ్రాంత ఉద్యోగి కుటుంబానికి రక్షణ కవచం పింఛను)