వికసిత భారత్ లో ఏపీ మొదటి స్థానంలో నిలవాలి
• రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరం
• వ్యవస్థల బలోపేతంతో ప్రజలకు మేలు జరుగుతుంది
• భవిష్యత్ ను అంచనా వేయడంలో సీఎం చంద్రబాబు దూరదృష్టి అద్భుతం
• గత ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చులతో ప్రజా ఖజానా విచ్ఛిన్నం
• ప్రజలు అన్నీ గమనిస్తారు… సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు
• శక్తి, సంపద, సమగ్రాభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం
• స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ సీఎం మార్క్
ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్
న్యూస్‌తెలుగు/విజయవాడ :స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందక, డోలీల్లో రోగులను, బాలింతలను తీసుకొచ్చే పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలు 2,854 ఉన్నాయని అధికారులు చెప్పారన్నారు… అక్కడ సరైన రోడ్ల సదుపాయం, వైద్య సౌకర్యాలకు దాదాపు రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారన్నారు. ఇంతటి కీలకమైన సమస్యను తీర్చడానికి ప్రభుత్వ ఖజానాలో తగినన్ని నిధులు లేవన్నారు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 500 కోట్లు, సర్వే రాళ్లు పాతేందుకు రూ.1,200 కోట్లను దుబారా చేసిందన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేసిన నిధులు మన దగ్గర ఉంటే కనీసం 1400 గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం, వైద్య సదుపాయాలు కల్పించే వీలుండేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో గిరిజన గ్రామాలకు మూడు దశల్లో రోడ్ల సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి తిరిగి పుంజుకోవడానికి మనమంతా సమష్టిగా ముందుకు వెళ్లాలన్నారు… ఐశ్వర్యం, ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం అన్నారు.
ట్విన్ టవర్స్ వంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించడం చాలా కష్టమన్నారు. వాటిని కూల్చివేసేందుకు తీవ్రవాదులకు నిమిషాలే పట్టిందన్నారు. ఏ వ్యవస్థ అయినా, నిర్మాణాన్ని అయినా నిర్మించడం చాలా కష్టం. కూల్చేయడం తేలిక. గత ప్రభుత్వం కూల్చివేతలతో తన పాలనను మొదలుపెట్టి పూర్తిగా కూలిపోయిందన్నారు. అధికారులు వారి బలం వారే తెలుసుకోవాలన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మీ శక్తిని మీరు తెలుసుకోవాలి, వ్యవస్థలను గాడిలో పెట్టే కీలకమైన శక్తి ప్రభుత్వ కార్యనిర్వాహక యంత్రాంగం దగ్గర ఉందన్నారు. దానిని తెలుసుకొని పని చేస్తే మనందరం కలలుగనే కొత్త ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా సాధ్యమన్నారు. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా ఒత్తిళ్ళకు, భయాలకు అతీతంగా పనిచేయండన్నారు. మీకు కచ్చితంగా ప్రభుత్వ మద్దతు ఉంటుంది. మీరు చేసే పని ప్రజలకు మేలు చేసేది అయితే దానిని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. 1994 సమయంలో విజన్ 2020 అని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అపహాస్యం చేసిన వ్యక్తులే ఈరోజు సైబరాబాద్ లో స్థలాలు కొనుక్కుని ఆనందంగా ఉన్నారన్నారు. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో తీసుకువచ్చిందే ఈ “స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్” అన్నారు.
రూల్ ఆఫ్ లా బలంగా ఉండాలి..
చాలా మంది పెట్టుబడుదారులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉండటం. రూల్ ఆఫ్ లా అనేది బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ది సాధిస్తుంది. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే ప్రతీ ఒక్కరికి కూడా రూల్ ఆఫ్ లా సమానంగా ఉండాలి. గోవా గొప్ప పర్యటక ప్రాంతం. ఆ రాష్ట్రానికి సగం ఆదాయం పర్యటకం మీదనే వస్తోంది. మన రాష్ట్రానికి కూడా విశాలమైన తీరప్రాంతం ఉంది. గోవా కంటే అద్భుతాలు చేయగలిగే వనరులు మన దగ్గర ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యటకులకు రక్షణ కల్పించడం మన ప్రధాన బాధ్యత.
ముఖ్యమంత్రి, నేను పరస్పరం గౌరవించుకుంటాం…
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు నాకు ఎంతో గౌరవం ఇస్తారు. ఏ విషయంలో కూడా సంప్రదింపులు లేకుండా ముందుకు వెళ్లరు. నేను కూడా ఆయన నాయకత్వ తీరును, ఓపికను దగ్గర నుంచి గమనిస్తూ ప్రతి అంశాన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని భావిస్తాను. 21వ శతాబ్దంలో కూడా- నా కులం, నా వర్గం అంటే కష్టం. విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. సమస్యలు అందరికి ఉంటాయి. వాటిని శాంతియుత పంథాలో పరిష్కరించుకుందాం. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది.
ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ స్పీచ్…
సీఎం చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞడు రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర @ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయడం చరిత్రను మలుపు తిప్పే రోజు అని అందులో మనందరం భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ ఆంధ్ర @ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటలు, రోజులపాటు పనిచేసిన అవిశ్రాంతమైన కృషి ఉందన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో ముఖ్యమంత్రి మూలకారకుడు అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ను రూపొందించినట్లు చెప్పారు. దేశంలో విజన్ డాక్యుమెంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. అప్పట్లో విజన్ 2020 తీసుకువచ్చినప్పుడు అందరూ ఏవేవో మాట్లాడారని, నేడు వాటి ఫలితాలు హైదరాబాద్ లో కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమి, భవనాలు కూల్చటం కాదన్నారు. విజన్ 2020 ఆలోచనల నుంచి పుట్టిందే నూతన హైదరాబాద్ అని నేడు అది విశ్వనగరంగా మారి లక్షల ఉద్యోగాలు ఐటీలో అందిస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే కాకుండా, దేశంలో ఏపీని మళ్లీ మొదటి స్థానంలో నిలబెట్టేందుకే ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే ఐటీ, డ్రిప్ ఇరిగేషన్ రంగాల్లో చేసిన ఆలోచనలు ఎంతోమంది జీవితాల్లో స్థిరపడేందుకు దోహదం చేశాయన్నారు. ముఖ్యమంత్రి రేపటి ఎన్నికల గురించి ఆలోచించరని కాని భవిష్యత్ తరాల గురించి ఆలోచించే రాజనీతిజ్ఞుడని తెలిపారు.
ఆథోనీ శాసనసభ్యులు పార్థసారథి మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర @ విజన్ 2047 డాక్యుమెంట్ ద్వారా వచ్చే 100 ఏళ్లలో ప్రజలు మెరుగైన సౌకర్యాలు పొందుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో విజన్ డాక్యుమెంట్ లో పెట్టిన అంశాలన్నీ నెరవేరి కలల సాకారం జరుగుతుందని విశ్వసిస్తున్నానన్నారు. ప్రజలంతా ఈ విజన్ డాక్యుమెంట్ లో భాగస్వాములు కావాలన్నారు.. (Story : వికసిత భారత్ లో ఏపీ మొదటి స్థానంలో నిలవాలి)