ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తా
ఉపాధ్యాయుల సమస్యలపై చీఫ్ విప్ జీవీకి యూటీఎఫ్ నాయకుల వినతిపత్రం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఉపాధ్యాయులకు సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తానని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇదే సమయంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా లకు వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ నాయకులు మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. విద్యాశాఖ అధికారుల కొన్ని అసంబద్ధ నిర్ణయాలు రద్దు చేయాలని కోరారు. పాఠశాలల పనివేళలు పెంపు, టీచర్లపై యాప్‌ల భారం తగ్గించాలని, 10%కి మించి ఉపాధ్యాయులు సెలవు పెట్టరాదనే ఆంక్షలు, 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధత పేరుతో విడుదల చేసిన 100 రోజుల కార్యాచరణ, విద్యార్థుల వివరాలు అపార్‌లో నమోదుతో పాటు ప్రతి నిర్ణయం అసంబద్ధగానే ఉంటున్నాయని జీవీకి దృష్టికి తీసుకెళ్లారు. మండలాల్లో 10%కి మించి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదని మండల విద్యా శాఖాధికారులు అత్యవసర సందర్భాల్లో కూడా సెలవులు ఇవ్వడం లేదన్నారు. విద్యాశాఖ నిర్ణయాలు పునఃసమీక్షించాలని, ఒత్తిడి లేని వాతావరణంలో ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పనిచేసే విధంగా అధికారులు నిర్ణయాలు ఉండాలని కోరుతున్నామని తెలిపారు. వారి చెప్పిన అంశాలన్నీ సావధానంగా విన్న చీఫ్ విప్ జీవీ విషయం మంత్రి దృష్టిలో పెడతానని వారికి హామీ ఇచ్చారు. పాఠశాల విద్య మెరుగుదల కోసం అందరం కలసి పనిచేద్దామని వారికి తెలిపారు.(Story : ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తా )