మహిళా సాధికారతకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : మహిళా సంఘాల సభ్యులు సమిష్టిగా చర్చించుకొని ప్రభుత్వం మహిళా సాధికారతకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి నాచహల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. గ్రామంలో మహిళా సమాఖ్య భవనం కొత్త నిర్మించి వదిలేసి సంవత్సరాలు గడిచిపోయిన స్థానిక శాసన సభ్యులు రూ. 5 లక్షలు మంజూరు చేసి పూర్తి చేయడంతో శనివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘం భవనాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అందరూ చర్చించుకొని వ్యాపారం చేసే విధంగా ముందుకు వస్తె ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు . క్లస్టర్ కోడినేటర్లు ప్రభుత్వ పథకాల పై మహిళలకు అవగాహన కల్పించి మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడాలని సూచించారు. స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, ఇప్పటికే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 22 వేల కోట్లతో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, సన్న రకం వరి ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు 2500 రూపాయలు, కొత్త రేషన్ కార్డులు మంజూరు వంటివి అమలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా తాను అన్నానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య, మాజీ ఎంపిపి కిచ్చారెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటయ్య, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.(Story : మహిళా సాధికారతకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి )