ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై
రోశయ్య చెరగని ముద్ర
రోశయ్య వర్ధంతి సందర్భంగా చీఫ్ విప్ జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన నివాళులు
న్యూస్ తెలుగు /వినుకొండ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చెరగని ముద్ర వేసిన అరుదైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. సౌమ్యుడు, సహన శీలిగానే రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని తెలిపారు. కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా వినుకొండలో జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన స్థానిక నరసరావుపేట రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ రోశయ్య తనవిలక్షణ శైలితో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తర్వాత తమిళనాడు గవర్నర్‌గానూ సేవలు అందించారని కొనియాడారు. మంత్రిగా, సీఎంగా, గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ఎనలేని సేవలు చేశారని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రోశయ్య అపార అనుభవశాలి అన్నారు. ఈ రాష్ట్రంలో రోశయ్యకు తర్వాత ఆ స్థాయి అనుభవం ఉన్నవ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా దాదాపు 40 ఏళ్లకుపైగా ఆయన ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కార్యక్రమములో టిడిపి నాయకులు గురునాధం, పి.వి. సురేష్ బాబు, పట్టణ టిడిపి అధ్యక్షుడు పటాన్ ఆయుబ్ ఖాన్, మేడా రమేష్ బీజేపీ నాయకులు, మోటమర్రి నరసింహారావు, గోరంట్ల హనుమంతరావు, పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. (Story : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రోశయ్య చెరగని ముద్ర)