సన్ రైజ్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/ నంద్యాల : మౌలిక సదుపాయాలు లేకుండా తరగతులు నడుపుతున్న సన్రైజ్ పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్, నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ వెంకటేష్, సద్దాం లు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ మాట్లాడుతూ నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో ఉన్న సన్రైజ్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రేకుల షెడ్డులలో పాఠశాల నిర్వహిస్తుందని ఆరోపించారు. కనీస మౌలిక సదుపాయాలలో భాగంగా ఆటస్థలం లేదని, విద్యార్థులకు సరిపడే విధంగా మరుగుదొడ్లు లేవని, అర్హత కలిగిన అధ్యాపకులు లేకుండా పాఠశాలను నడుపుతున్నారు అన్నారు. అలాగే శానిటేషన్ సర్టిఫికెట్ లేకుండా, ఎస్సార్ బీసీ కాలనీ నుండి షిఫ్టింగ్ అనుమతి లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. అంతేకాకుండా సన్రైజ్ పాఠశాల యాజమాన్యం సంవత్సరానికి ఒక యూనిఫాం మారుస్తూ, యూనిఫామ్ పైన బ్లేజర్ తప్పకుండా ఉండాలంటూ విద్యార్థులను వేధిస్తున్నారని ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రుల పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మా పద్ధతి ఇంతే ఎక్కడైనా చెప్పుకోండి ఏమైనా చేసుకోండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా ఇరుకు సందులలో పాఠశాల నిర్వహిస్తూ కనీసం చిన్న ఆటో కూడా వెళ్లలేని సందులో నుండి విద్యార్థులను ఎక్కడో బయట వ్యాన్లో నుంచి దింపి బ్యాగులను బరువుతో పాఠశాలకు దూరం నుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. సమస్యలపై నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ధనుంజయ్ తెలిపారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహిస్తూ, యూనిఫాంల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న సన్రైజ్ పాఠశాలపై చర్యలు తీసుకొని ఆ పాఠశాల యాజమాన్యం గుర్తింపు రద్దు చేసి, సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ధనుంజయ్ హెచ్చరించారు. (Story : సన్ రైజ్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి)