Homeఒపీనియన్‌సంగీతం ఉన్నంతకాలం ప్రజల మనసుల్లో ఘంటసాల ఉంటారు..

సంగీతం ఉన్నంతకాలం ప్రజల మనసుల్లో ఘంటసాల ఉంటారు..

సంగీతం ఉన్నంతకాలం ప్రజల మనసుల్లో

ఘంటసాల ఉంటారు..

ఆయన బయోపిక్ చూడటం తెలుగు ప్రజల కర్తవ్యం 

రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం మీద తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’. కృష్ణ చైతన్య టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో సిహెచ్ శ్రీమతి ఫణి నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, నిర్మాత అశోక్ కుమార్, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, నటులు అశోక్ కుమార్, సుబ్బరాయ శర్మ, నటి జయవాణి, నిర్మాత దామోదర ప్రసాద్, దర్శకులు కర్రి బాలాజీ తదితరులు హాజరయ్యారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… ”అందరికీ నమస్కారం. నేను సినిమా కార్యక్రమాలకు వెళ్లను. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తాను, ముఖ్యంగా పాత సినిమాలు చూస్తాను. ఇప్పుడు కొత్త సినిమాలకు చూసే పరిస్థితి లేదు కనుక ఎక్కువగా చూడను. ఘంటసాల గారి జీవితం గురించి నవ తరానికి, యువ తరానికి, నేటి తరానికి తెలియచెప్పే కార్యక్రమం కనుక వచ్చాను. ఘంటసాల వారి సమగ్ర జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని సినిమా తీశామని, అన్ని విషయాలు స్పృశించామని చెప్పడంతో వచ్చాను. ఈతరం ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజా గాయకుడిగా, ప్రముఖ సంగీత దర్శకుడిగా, అన్నిటికి మించి అమర గాయకుడిగా దేశానికి, తెలుగు ప్రజలకు పరిచయస్తులు. వారి జీవితం ఆధారంగా తీసిన ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రాన్ని వీక్షించే అవకాశం లభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. భగవద్గీత శ్లోకాలు ఆయన పాడుతుంటే ప్రజలు అందరూ ఎంతో తన్మయత్వంతో వినేవారు. ఘంటసాల గారిపై సినిమా తీయడం సాహసం. ఎందుకంటే… సినిమా తీయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకని, నిర్మాత శ్రీమతి ఫణి గారిని అభినందిస్తున్నా. ఆర్థిక దృక్కోణంతో కాకుండా సామాజిక చైతన్యం కలిగించేందుకు, ఒక సుమధుర గాయకుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలనే గొప్ప ఆలోచనతో నిర్మాణంలో పాలు పంచుకున్న జీవీ భాస్కర్, లక్ష్మి ప్రసాద్ లకు అభినందనలు. ఘంటసాల పాత్రలో నటించిన యువ గాయకుడు కృష్ణ చైతన్య, శ్రీమతి పాత్రలో నటించిన మృదులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇదొక చక్కటి ప్రయత్నం. ఘంటసాలను శతాబ్ది గాయకుడు (సింగర్ ఆఫ్ సెంచరీ) అంటారు. నేను ఆయన్ను అమర గాయకుడు అంటాను. సంగీతం ఉన్నంత కాలం ఆయన ప్రజల మనసుల్లో ఉంటారు. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం సంగీతంతో సాగుతూ… స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా, సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, భగవద్గీత గానాన్ని అందించిన తొలి తెలుగు స్ఫూర్తిగా భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, ఘంటసాల అభిమానులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. కమర్షియల్ హంగులతో కాకుండా సదుద్దేశంతో తీశారు కనుక సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం. నేను ఉపరాష్ట్రపతి అయ్యాక రాత్రి ఏడున్నర తర్వాత కార్యక్రమాలు బంద్. తొమ్మిదిన్నరకు నిద్రపోయేవాడిని. తెల్లవారి నిద్ర లేచాక అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలు పాటలు వినేవాడిని” అని అన్నారు.

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ… ”ఓ ఎన్టీఆర్, ఓ ఏయన్నార్, ఓ ఘంటసాల. ఎన్టీఆర్, ఏయన్నార్ ఉన్నంత కాలం ఘంటసాల ఉంటారు. ఆ మహనీయుడి చరిత్ర సినిమా తీసి జన్మ ధన్యం చేసుకుంటున్న దర్శకులు రామారావు గారికి, నిర్మాత ఫణి గారికి, ఘంటసాల పాత్రలో నటించిన తమ్ముడు కృష్ణ చైతన్యకు అభినందనలు. ఘంటసాల అంటే గానగంధర్వుడు, సంగీత దర్శకుడిగా తెలుసు. ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. ఉత్తరాది గాయకులకు ఇచ్చి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చి ఎన్టీఆర్‌కు ఇవ్వలేదు. ఆయనకూ ఇవ్వాలి” అని అన్నారు.

‘ఘంటసాల: ది గ్రేట్’లో టైటిల్ రోల్ పోషించిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ… ”మా చిత్రాన్ని ఆశీర్వదించాడు విచ్చేసిన వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు. నేను ఒక గాయకుడిని. నాకు యాక్టింగ్ పెద్దగా రాదు. పెద్ద పెద్ద నటులు మా సినిమాలో ఉన్నారు. సినిమా బావుండి, నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు రామారావు గారికి థాంక్స్” అని అన్నారు.

దర్శకులు సిహెచ్ రామారావు మాట్లాడుతూ ”ఘంటసాల పాట అందరికీ తెలుసు. ఆ పాట ఎంత గొప్పదో తెలుసు. కానీ, ఆయన వ్యక్తిత్వం చాలా కొంతమందికి తెలుసు. కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతో విద్య ప్రకాశిస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఘంటసాల. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ జీవితాన్ని మా సినిమాలో చెప్పడం జరిగింది. భారతదేశ సినిమా చరిత్రలో ఏ గాయకుడి మీద పూర్తిస్థాయి నిడివి సినిమా రాలేదు. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చిన భగవంతుడికి సర్వదా కృతజ్ఞుడిని” అని అన్నారు.

ఘంటసాల వెంకటేశ్వరరావు, సావిత్రి పాత్రల్లో నిజజీవిత దంపతులు కృష్ణ చైతన్య, మృదుల నటించిన ‘ఘంటసాల ది గ్రేట్’ సినిమాలో సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షితులు మాస్టారు, మాస్టర్ అతులిత్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఎడిటర్: క్రాంతి (KR), డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వేణు మురళీధర్ వి, మ్యూజిక్: వాసు రావు సాలూరి, నిర్మాతలు: శ్రీమతి సిహెచ్ ఫణి, సిహెచ్ రామారావు, కథ – కథనం – మాటలు – దర్శకత్వం: సిహెచ్ రామారావు. (Story : సంగీతం ఉన్నంతకాలం ప్రజల మనసుల్లో ఘంటసాల ఉంటారు..) 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!