కరెంటు ట్రూ ఆఫ్ చార్జీలను, గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలి
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కరెంటు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని, కరెంటు ట్రూ అప్ చార్జీలను పెంచాలనే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్ లో గురువారం నాడు జరిగిన వామపక్ష ప్రజాసంఘాల సంయుక్త సమావేశంలో అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత వైసిపి ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచి, స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రయత్నం చేసి నపుడు వాటిని వ్యతిరేకిస్తూ ఆనాడు టిడిపి వామపక్షాలతో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభుత్వాన్ని విమర్శించారని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు ప్రజలకు వాగ్దానం ఇస్తూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఎత్తివేస్తామని కరెంటు చార్జీలు పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చి ఈనాడు అధికారంలోకి వచ్చి మరలా కరెంటు ట్రూ అప్ చార్జీలు 18 వేల కోట్ల రూపాయలు పెంచాలనే ఆలోచన చేయడం రాష్ట్ర ప్రజలపై పెను భారం వేయడమేనని ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించి ఆనాటి అంబానీ జగన్మోహన్ రెడ్డిల అక్రమ సంబంధంతో ఏర్పడిన స్మార్ట్ మీటర్లను ఆనాడు వ్యతిరేకించిన టిడిపి ఈనాడు మరల స్మార్ట్ మీటర్లను గృహ వినియోగదారులకు బిగించాలనుకోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వం మరో అక్రమ సంబంధానికి ఒడికట్టి గౌతమ్ అదాని కంపెనీల నుండి సోలార్ ఎనర్జీని ఒక యూనిట్ రు. 2.49 పైసలకు కొనుగోలు చేసిందని ఆనాడు సోలార్ ఎనర్జీని గుజరాత్ ప్రభుత్వం ఒక యూనిట్ రు. 1.99 పైసలకు కొనుగోలు చేసిందని దేశం మొత్తం అంతకుమించి రేట్లు లేకపోయిననూ ఎక్కువ రేటుకు కొనుగోలు చేసినందున ఆనాడు గౌతమ్ అదానీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని అదా నీ కంపెనీ అధికారులు పెద్దలు చెప్పడం జరిగిందని ఆ విధమైన రిపోర్టుతో అమెరికాలో కూడా ఎఫ్ఐఆర్ నమోదయిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని కాపాడవలసిన పెద్దలు ఈ విధంగా ప్రజల, ప్రభుత్వ సొమ్మును దిగమింగటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వెంటనే అదాని, జగన్ లపై సోలార్ ఎనర్జీ ఒప్పందాలపై సిబిఐ, ఈడి దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తే అన్ని వామ పక్షాలు ప్రజాసంఘాలతో పోరాట కార్యక్రమాలు రూపొందించి కరెంటు చార్జీలు తగ్గించే వరకు పోరాడుతామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు బూదాల చిన్న, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఎ. పవన్ కుమార్,ఎమ్మార్పీపీస్ నేత రెడ్డి బోయిన ప్రసన్నకుమార్ చిన్న , ప్రజా సంఘాల నాయకుడు ఆర్కే నాయుడు, సిపిఎం రైతు సంఘం నాయకుడు ముని వెంకటేశ్వర్లు, సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పట్టణ లీడర్ ఫిరోజ్, ఏఐటీయూసీ నాయకులు షేక్. కిషోర్,చిన్న, ధూపాటి మార్కు, షేక్ మస్తాన్, కొప్పరపు మల్లికార్జునరావు మహిళా నాయకులు వెంకటేశ్వరమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.(Story : కరెంటు ట్రూ ఆఫ్ చార్జీలను, గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలి)