వినుకొండలో లక్ష సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలి
సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు ప్రతి 4 ఓట్లలో ఒకరికి తెదేపా సభ్యత్వం
తెదేపా జీవితకాల సభ్యత్వం తీసుకున్న నాయకులకు ఎమ్మెల్యే జీవీ సత్కారం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో ఈసారి కనీసం లక్ష సభ్యత్వాలే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. గత సారి 67 వేలు సభ్యత్వాలు చేయించామని, ఈసారి ఆ సంఖ్య దాటించేందుకు ప్రతిఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ మేరకు ఆదివారం వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈపూరు మండల నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమీక్షా సమావేశం నిర్వహించారు. లక్ష సభ్యత్వాల్ని ఎలా చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు ప్రతి 4 ఓట్లలో ఒకరికి తెదేపా సభ్వత్యం ఉండేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెదేపా జీవితకాల సభ్యత్వాన్ని తీసుకున్న నాయకులను సత్కరించారు. గోపువారిపాలెం సర్పంచ్ గోనుగుంట్ల శ్రీనివాసరావు, అంగలూరు సొసైటీ మాజీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీనివాసరావు(గుండేపల్లి), సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు కాకుమాను రామారావు (బొగ్గరం) రూ.లక్ష చొప్పున చెల్లించి పార్టీ జీవితకాల సభ్యత్వం పొందారు. జీవితకాల సభ్యత్వం స్వీకరించినందుకు గాను వారి ముగ్గురిని ఎమ్మెల్యే జీవీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్టీ నాయకులు, శ్రేణులంతా యువత, మహిళలతో పాటు మొన్నటి ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన వర్గాలు తెదేపా సభ్యత్వాలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులు, మండల, గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారంతా కూడా సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రికార్డు స్థాయిలో నిర్వహించాలని ఎమ్మెల్యే జీవీ కోరారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు ప్రక్రియ తప్పనిస రి అన్నారు. సభ్యత్వాల్లో వినుకొండ నియోజకవర్గం మేటిగా ఉండాలన్నారు.(Story:వినుకొండలో లక్ష సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలి)