ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో డబల్ ఓట్లు ఉంటే తనిఖీ చేసి తొలగించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2025 లో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో డబల్ ఓట్లు ఉంటే తనిఖీ చేసి తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పోలింగ్ బూత్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితాలో డబల్ ఓట్లు ఉంటే వాటిని ఫారం – 7 ద్వారా తొలగించాలని, మార్పులు ఏమైనా ఉంటే ఫారం – 8 ద్వారా చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్ జాబితాలను తప్పక ప్రదర్శించాలని బీఎల్ఓలను ఆదేశించారు. 1-1-2025 నాటికి 18 ఏళ్ళు నిండిన యువత ఎవరైనా కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకోవలనుకుంటే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచని, ఇందుకోసం బీఎల్ఓ లు ఇపుడు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా ఓటర్లు మరణించిన పక్షంలో వారిని జాబితా నుంచి తొలగించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మున్సిపాలిటీ లోని బండారు నగర్ లో ఎన్యుమరేటర్లు సర్వే చేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. సూపర్ వైజర్లు ఎన్యుమరేటర్లకు పర్యవేక్షణ చేయాలన్నారు. కుటుంబ వివరాల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రజలు కూడా సర్వే సిబ్బందికి కావాల్సిన సమాచారాన్ని అందించడంలో సహకరించాలన్నారు. ఆర్డివో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేష్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ పూర్ణ చందర్,బీఎల్ఓ లు, ఎన్యుమరేటర్లు, తదితరులు ఉన్నారు.(Story:ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో డబల్ ఓట్లు ఉంటే తనిఖీ చేసి తొలగించాలి)