పెండింగ్ బిల్లుల విడుదలకు ఆమోదంతో ఎంతోమందికి న్యాయం
పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదలకు పచ్చ జెండాతో ఎంతోమందికి న్యాయం జరగబోతోందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. కీలకమైన ఆ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2014-15 నుంచి 2018-19 మధ్య పనులు చేసి, బిల్లులు రాక ఇంతకాలం ఎన్నో అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లకి ఇది ఊపిరి నిలిపే శుభవార్తగా పేర్కొన్నారాయన. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో ఈ మేరకు నీరు చెట్టు పనుల బకాయిల చెల్లింపులు చేయాలన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఎంతోమంది అప్పులు తెచ్చి మరీ పనులు చేసినా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపుల కారణ ణంగా బిల్లులు నిలిపివేయడంతో ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా చూడాల్సిన వచ్చిందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో జగన్ ప్రభుత్వం రావడంతోనే నీరు చెట్టు కింద పనులు చేసిన వారికి కష్టాలు మొదలయ్యాయని, సుమారు రూ. 1,216.84కోట్ల బిల్లులు చెల్లించకూడదనే దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తర్వాత కోర్టు కేసులతో మెట్టుదిగినా విజిలెన్స్ తనిఖీల పేరుతో వేధింపులకు పాల్పడి బిల్లులన్నీ పెండింగ్‌లో ఉంచారన్నారు. వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం రాగానే ఆగస్టులో రూ.256 కోట్లు కేటాయించారన్న జీవీ ఇప్పుడు మంత్రివర్గం ఆమోదంతో మిగిలిన బకాయిలు కూడా చెల్లింపులు చేసే అవకాశం వచ్చిందన్నారు. జగన్ పాలనలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులను దారుణంగా ఇబ్బందులకు గురిచేశారని, కోలుకోలేని స్థాయిలో దెబ్బతీశారన్నారు. అవన్నీ గమనించే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనేక సందర్భాల్లో పెండింగ్ బిల్లుల గురించి ప్రస్తావించానని, ఇంతకాలంగా అందరి ఎదురుచూపులకు మోక్షం లభించి ఫలితం దక్కుతున్నదందుకు సంతోషంగా ఉందన్నారాయన. ఇదే సమయంలో నీరుచెట్టు పనులు తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయంతో అందరికీ మళ్లీ మేలు జరిగే అవకాశం వస్తుందన్నారు. అలానే మంత్రివర్గం ఆమో దం పొందిన భూకబ్జా నిరోధక చట్టంతో ఇంతకాలంగా పేట్రేగిపోయిన కబ్జాకోరులకు ముకుతాడు పడుతుందన్నారు. కొత్త చట్టం ప్రకారం ఆక్రమణ దారులకు 10-14 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండడంతో భూఅక్రమాల ఆలోచనలు రావాలంటే భయం పుట్టే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ – కూటమి ప్రభుత్వానికి ఇదే తేడా అన్న ఎమ్మెల్యే జీవీ వాళ్ల తీసుకుని వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజల ఆస్తులను తన్నుకు పోయేలా ఉంటే, దానిని రద్దు చేయడంతో పాటు సీఎం చంద్రబాబు ఇలా కబ్జాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకుని రావడం ద్వారా ప్రజ ల్లో వారి ఆస్తులు వారివే అనే నమ్మకాన్ని పెంచడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.(Story:పెండింగ్ బిల్లుల విడుదలకు ఆమోదంతో ఎంతోమందికి న్యాయం)