హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది
హైందవ ధర్మ భజన సత్సంగ మండలి సమ్మేళనంలో పాల్గొన్న జీవీ, మక్కెన
న్యూస్‌తెలుగు/వినుకొండ : దేశంలో హైందవధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాముడు. శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు లాంటి ఎంతోమంది మహానుభావులు నడయాడిన ఈ పుణ్యభూమిపై పుట్టడం మనందరి అదృష్టంగా భావించాలన్నారాయన. వినుకొండ బోసుబొమ్మ సెంటర్‌లోని శ్రీ వాసవీ కల్యాణ మండపంలో బుధవారం విశ్వహిందూ మహాసంఘ్ భారత్ వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయి హైందవ ధర్మ భజన సత్సంగ మండలి సమ్మేళనం జరిగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు భజన పాటలు వినిపించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఇలాంటి భజన కార్యక్రమాలు భక్తిభావాన్ని పెంచి, భగవంతుడితో అవినాభావ సంబంధంలోకి తీసుకుని వెళ్తాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని.. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి శివశక్తి ఫౌండేషన్ నుంచి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. చాగంటి కోటేశ్వరరావు లాంటి వారిని కూడా తీసుకొచ్చి వినుకొండలో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని సత్సంగం వారిని కోరుతున్నట్లు తెలిపారు. అందరు ధర్మం ఆచరిస్తూ మరో 10 మంది పాటించేలా చేస్తే చాలు సమాజం దానంతటదే మారు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. స్థానిక రామలింగేశ్వరస్వామి గుడి కమిటీని వేయాలని ఇటీవలే నిర్ణయించామనీ ఆయన తెలిపారు. మెట్ల మార్గం పునరుద్ధరణకు కూడా కృష్ణాంజనేయులు ఆధ్వర్యంలో కమిటీ వేస్తామన్నారు. ఆ మార్గం నిర్మాణానికి తనతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన, ఇంకా ఎంతోమంది విరాళాలు ప్రకటించారని తెలిపారు. ఇప్పటికే రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణానికి రూ.11 లక్షల విరాళం ప్రకటించానని, త్వరలోనే కొత్త కమిటీ ఏర్పాటైన తర్వాత ఆ మొత్తం అందిస్తామన్నారు. శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన ఈ రామలింగేశ్వరస్వామి గుడిని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికి ప్రజలు కూడా తమవంతు సాయం అందించాలని కోరారు. సీఎం చంద్రబాబును అడిగిన వెంటనే నిధులు ఇచ్చారని, కొండ పై ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి, కల్యాణ మండపాలు నిర్మించడానికీ రూ.2 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా పెద్దఎత్తున పెట్టు కోవడానికి తితిదే కల్యాణ మండపం నిర్మాణానికి రూ.3 కోట్లను సీఎం చంద్రబాబు మంజూరు చేశారన్నారు. రానున్న రెండేళ్లలో త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. (Story ; హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది)