సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై అవగాహన
జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా (వై. లకుమయ్య ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక సర్వే ప్రక్రియలో, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్వహించడానికి ఎన్యుమరేటర్లు ఖచ్చితమైన శిక్షణను పొంది ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సామాజిక, ఆర్ధిక, సర్వే నిర్వహణలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్వే నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టబోతున్న సందర్భంగా సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లు శిక్షణ పొంది నిష్ణాతులు కావాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కుటుంబాల సమగ్ర సమాచార సేకరణ చేపట్టాలని సూచించారు. సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు చిట్టచివరి పేదవారికి చేరేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సామాజిక, ఆర్థిక, విద్య , ఉపాధి, రాజకీయ, కులాల వారిగా సర్వేలో వివరాలు నమోదులు చేయాలని తెలిపారు. నిర్వహణకు పదిమంది ఎన్యూమరేటర్లను పర్యవేక్షణ చేసేందుకు ఒక సూపర్ వైజర్ ను నియమించడం జరిగిందని అన్నారు. గ్రామంలోని 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ ను నియమించనున్నట్లు తెలిపారు. ఇంటి నెంబరు ఆధారంగా సర్వే ఉంటుందని, ఎన్యూమరేటర్లు తు.చ తప్పక ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సమాచారాన్ని నింపాల్సి ఉంటుందని అన్నారు. ఆధార్ కార్డు ప్రకారం కచ్చితంగా వివరాలు నమోదు చేయాలన్నారు. సర్వే ప్రక్రియలో సూపర్ వైజర్స్ పది శాతం కచ్చితంగా తనిఖీ చేయాలని తెలిపారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నవంబర్ 6వ తేదీ నుండి సర్వే మొదలవుతుందని, మండలాల వారిగా ఎన్యూమరేటర్లుకు
శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
నమోదులోజిల్లా కోడ్, మండల కోడ్, ఎన్యూమరేషన్ నంబర్స్ కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సర్వే అనంతరం వివరాలను డేటా ఎంట్రీ చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లును ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఎన్యుమరేషన్ బ్లాక్ లోని అన్ని కుటుంబాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, నిర్దేశించిన లక్ష్యం మేర బ్లాకు మించితే అదనపు ఎన్యూమరేషన్ బ్లాకులుగా కేటాయించి నమోదులు చేయాలని తెలిపారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన ఎన్యూమరేషన్ బ్లాకులో ప్రతి కుటుంబాన్ని క్రమ పద్ధతిలో జాబితా తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఇంట్లో నివసించే వారి సంఖ్యను నిర్ధారించాలని, ప్రతి కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించి (ఇంటి నంబరు, ఇంటి యజమాని పేరు వంటి వివరాలు) ఫారంలో నమోదు చేయాలని సూచించారు. సర్వే పూర్తి అయిన తదుపరి వివరాలు నింపిన స్టిక్కర్ ని ఇంటి గోడపై అతికించాలన్నారు. సర్వే నిర్వహణ
ఎన్యుమరేటర్లు మార్గదర్శకాలను అనుసరించి సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు సర్వేలో ప్రజలతో గౌరవంగా, హుందాగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశంపై ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. తయారు చేయబడిన ప్రశ్నావళిని ఉపయోగించి సమాచారాన్ని సేకరించాలని, ప్రతి ఇంటి నుండి స్పష్టత కల్గిన ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. సూపర్వైజర్ లు ఫీల్డ్ ఎన్యుమరేటర్ల పనితీరును పర్యవేక్షించి అవసరమైన సహాయాన్ని అందించాలని, ఏదేని సందేహాలు వస్తే వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై అవగాహన )