సాఫీ, ప్రమాదరహిత రోడ్లే కూటమి ప్రభుత్వం లక్ష్యం
వినుకొండ-కారంపూడి-మాచర్ల రహదారి మరమ్మతులు ప్రారంభించిన జీవీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సాఫీ, ప్రమాదరహిత రోడ్లు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంమని వినుకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందులో భాగంగానే పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్నిరోడ్లకు మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణం చేపడతున్నా మని తెలిపారు. మంగళవారం వినుకొండ-కారంపూడి-మాచర్ల రహదారి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. వైసీపీ పాలనలో భారీ గుంతలతో అధ్వాన్నంగా మారిన రహదారికి రూ.కోటితో మరమ్మతులు చేపట్టారు. వినుకొండ నుంచి మాచర్ల వరకు ఈ పనులు చేపట్టనున్నారు. వినుకొండ విష్ణుకుండినగర్ వద్ద గుంతలపై ఎమ్మెల్యే జీవీ మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు పాల్గొని కంకర పోసి మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతులకు ఇప్పటికే సీఎం చంద్రబాబు రూ.600 కోట్లు మంజూరు చేశారన్నారు. అవసరమైతే మరో రూ. 300 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని తెలిపారు. వాటికి అదనంగా సమగ్ర గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.4,500 కోట్లతో 30 వేలకుపైగా పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500bకిలోమీటర్ల తారురోడ్లకు మరమ్మతుల పనులు, 3వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 25bవేల గోకులాలు, 10 వేల వాన నీటి సంరక్షణ కందకాల పనులు ఒకేసారి ప్రారంభించుకున్నామని తెలిపారు. వీటితో పాటు కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాల సమన్వయంతో అభివృద్ధి చేస్తున్న కొత్త జాతీయ రహదారులతో వినుకొండ గేట్ వే ఆఫ్ రాయలసీమగా ఎదుగుతుందన్నారు. అమరావతి కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి ఫలాలు జాతీయ రహదారుల రూపంలో మనకు కూడా అందుబోతున్నాయని, వినుకొండ నుంచి గుంటూరు వరకు 4 లైన్ల రహదారికి నిధులిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆ హైవే పూర్తయితే అభివృద్ధిలో వినుకొండకు ప్రాధాన్యత పెరుగుతుందని, ప్రజలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతీ ఆర్bఅండ్ బీ రహదారికి మరమ్మతులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకు కూడా మరమ్మతు చేపట్టి రహదారి ప్రమాదాలను నివారిస్తామని వివరించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం గుంతల పూడ్చలేదు గానీ రూ.10.50 లక్షల కోట్లు అప్పులు మాత్రం రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టిపోయారన్నారు. వైసీపీ పాలనలో రోడ్లు పట్టించుకోకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ఆటోలు, టాక్సీల డ్రైవర్ల తీవ్ర కష్టాలు పడ్డారన్నారు. సంపాందించేది వాహనాల మరమ్మతులకు కూడా సరిపోక నానావస్థలు పడ్డారని వాపోయారు. ఈ పరిస్థితి మారేలా పనులు మొదలు కావాలని, దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. మాపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేరుస్తామని, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠన్ అయ్బుఖాన్, టిడిపి నాయకులు పత్తి పూర్ణచంద్రరావు, పి వి సురేష్ బాబు, జానీ భాష ,పళ్ళ మీసాల దాసయ్య, గ్రంథం కోటేశ్వరరావు, సుబ్బారావు, చికెన్ బాబు, సోమేపల్లి శ్రీనివాసరావు, గంగినేని రాఘవ, బోల్లేపల్లి వెంకటరావు, ప్రభుత్వ అధికారులు ఆర్ అండ్ బి డి.ఈ వెంకటేశ్వరరావు, ఏ.ఈ కె. గణేష్, టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story : సాఫీ, ప్రమాదరహిత రోడ్లే కూటమి ప్రభుత్వం లక్ష్యం)