సుపరిపాలనను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పట్టభద్రులదే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన జీవీ, మక్కెన
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో సుపరిపాలనను ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత యువత, పట్టభద్రులపైనే ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వారి ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత సీఎం చంద్రబాబు, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. వినుకొండ శివయ్య స్తూపం సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సందర్శించారు. పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో ముచ్చటించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ వినుకొండతో పాటు పల్నాడులో డిగ్రీ పూర్తిచేసిన వారు చాలామంది ఉన్నారన్నారు. వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు ఉన్నా ఇప్పుడు అది చెల్లదని, కొత్తగా నమోదు చేసుకోవాల్సిందేనని చెప్పారు. ఓపెన్ డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులేనని తెలిపారు. 2022లో డిగ్రీ పూర్తయిన వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ అహర్నిశలు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వం ముందున్న ధ్యేయమన్నారు. 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్‌లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని చెప్పారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా పట్టభద్రులంతా ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీమంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఆయనకు ఎంతో అనుభవం ఉందని, విద్యా సంస్థల నిర్వహణలో కూడా ఆయనకు చాలా అనుభవం ఉంది కాబట్టి, అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. మంచి వ్యక్తిని ఎన్నుకోవడం, మంచి ప్రభుత్వానికి అండగా ఉండటం కోసం, 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చదువుకున్న యువత మొత్తం ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 5 నాటికి ఈ ప్రక్రియ దాదాపు పూర్తవుతుందని, తర్వాత ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు చాలా విలువైందని, వజ్రాయుధం లాంటిదని, అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పత్తి పూర్ణచంద్రరావు, పివి సురేష్ బాబు, పల్ల మీసాల దాసయ్య, గంధం కోటేశ్వరరావు, వీర గంధం ప్రశాంత్, చికెన్ బాబు, నర్రా కిషోర్, బత్తుల గోవిందరాజులు, తన్నీరు ఆంజనేయులు, లింగా రామయ్య తదితరులు పాల్గొన్నారు, (Story : సుపరిపాలనను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పట్టభద్రులదే)