లక్షల ఉద్యోగాలిచ్చే కూటమే గెలుపే యువత లక్ష్యం కావాలి
ఎమ్మెల్యే జీవీని కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తెదేపా పరిశీలకుడు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్టంలో యువత కోసం, వారి భవిత కోసం లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నిర్విరామంగా కృషి చేస్తోన్న కూటమి అభ్యర్థుల గెలుపే యువత నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఇప్పుడు రాష్ట్రంలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు రూపంలోనే పనిచేసే కూటమి ప్రభుత్వానికి నైతికబలాన్ని అందించాలని కోరారు. తమవరకు వినుకొండ నియోజకవర్గంలో 10 వేలమంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వారిలో సింహభాగం ఓట్లు కూటమి అభ్యర్థికి పడేలా తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం చేయాలని, యువత మద్దతు సాధించాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వినుకొండ నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే జీవీతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వినుకొండ నియోజకవర్గ పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా సీనియర్ నాయకులు నల్లబోతు శ్రీనివాసరావ, రఘుబాబు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై చర్చించారు. అంతకుముందు వినుకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని వారు ముగ్గురు సందర్శించారు. పలువురు పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ రాష్ట్రం రానున్న అయిదేళ్లలో 20లక్షలమంది యువత ఉద్యోగాలు కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని అవకాశాలను పూర్తిస్థాయిలో అన్వేషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలన్నీ లెక్కలు తీస్తున్నారని, త్వరలోనే వాటిని జాబ్‌క్యాలెండర్ల ప్రకారం భర్తీ చేస్తారని అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఇప్పటికే కసరత్తు పూర్తయిందని మరికొన్ని రోజుల్లోనే ఆ ప్రకటన రాబోతోందన్నారు. ఏపీపీఎస్సీని కూడా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారని, సమర్థ అధికారిని ఇటీవలే ఛైర్మన్‌గా నియమించారన్నారు. అదే సమయంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఒకేరోజు ఆరువిధానాలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పట్టభద్రులైన యువత కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. (Story : లక్షల ఉద్యోగాలిచ్చే కూటమే గెలుపే యువత లక్ష్యం కావాలి)