శ్రీదేవి థియేటర్ వద్ద డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతం చెరువును తలపిస్తోంది
అధికారులతో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్
కబరస్థాన్ లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్న శ్రీరామ్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని శ్రీదేవి థియేటర్, గాంధీనగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. శనివారం ఆయన మున్సిపల్ అధికారులతో కలసి ధర్మవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా గాంధీనగర్ లోని కబరస్థాన్ లో వర్షపునీరు భారీ స్థాయిలో ఉండటాన్ని శ్రీరామ్ పరిశీలించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించాలన్నారు. వర్షం వచ్చిన ప్రతి సారి ఇలాంటి సమస్యే వస్తోందని పలువురు మైనార్టీలు అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటన్నదానిపై ఆలోచించాలని అన్నారు. మరోవైపు శ్రీదేవి థియేటర్, గాంధీనగర్ లో ఉన్న డ్రైనేజీలను శ్రీరామ్ పరిశీలించారు. చిన్న వర్షం కురిసినా.. మోకాలి లోతులో నీరు చేరుతోందని స్థానికులు అన్నారు. కనీసం మనుషులు నడిచే వెళ్లే అవకాశం కూడా ఉండదన్నారు. డ్రైనేజీలోని మట్టి, చెత్తా చెదారం రోడ్లపై అలాగే ఉండిపోతోందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్నది మున్సిపల్ అధికారులతో చర్చించారు. శ్రీదేవి థియేటర్ ప్రాంతం దిగువ ప్రాంతంలో ఉండటం, అలాగే డ్రైనేజీలు కుచించుకపోవడం వంటి దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈసమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటన్నది అధికారులు గుర్తించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. మరోవైపు ఇటీవల ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి హత్యకు గురైన నేపథ్యంలో ఆయన్ని శ్రీరామ్ పరామర్శించారు. ఈ సంఘటన తనకు చాలా బాధ కల్గించిందని.. నమ్మిన వారే ఇలా చేయడం దుర్మార్గం అన్నారు. ఈ ఘటన నుంచి త్వరగా కోలుకుని.. తిరిగి విధుల్లో కావాలని శ్రీరామ్ సీఐతో అన్నారు. (Story : శ్రీదేవి థియేటర్ వద్ద డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి)