కేడర్ నిర్లక్ష్యంపై చంద్రబాబు క్లాస్…..!
– ఇదే ఆఖరి హెచ్చరిక.. తీరు మారాలని హితబోధ
– టెన్షన్ పడుతున్న రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు
న్యూస్ తెలుగు/బాపట్ల : బాపట్ల జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని గమనించిన చంద్రబాబు జిల్లాలో పక్కాగా కేడర్ పట్ల నిర్లక్ష్యం జరుగుతోందని గ్రహించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈనెల 18న విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో పలువురికి క్లాస్ పీకినట్లు సమాచారం.దీంతో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో పార్టీ శ్రేణుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఎమ్మెల్యేలలో వణుకు పుట్టింది. చంద్రబాబు తీసుకున్న చర్యల వల్ల టీడీసీ శ్రేణులలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.బాపట్ల జిల్లాలో కొన్ని నియోజకవ ర్గాలలో టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కసిగా పనిచేసిన టీడీపీ నాయకులు, శ్రేణులు కొన్ని నియోజకవ ర్గాలలో ఎన్నికల తరువాత నాయకుల నిర్లక్ష్యాన్ని సహించలేకపోతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు పార్టీ శ్రేణులలోని ద్వితీయ శ్రేణి, మండల స్థాయి నాయకులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని ఎలా అధిగమించాలో తెలియని కొందరు నాయకులు రాజకీయాలలో స్తబ్ధుగా మారిపోయారు వారి అను చరులు కూడా నిర్లిప్తంగా ఉంటున్నారు. మరికొన్నిచోట్ల కూటమి అభ్యర్థుల విజయానికి పనిచేసిన నాయకులు పార్టీ శ్రేణులను కాదని కూటమి అభ్యర్థుల ఓటమికి కృషిచేసిన వైసీపీ వర్గాలకు సహకరి స్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు అదును కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఈ లోగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని నియోజకవర్గాల నుంచి ఇంటిలిజెన్స్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో అటువంటి ఎమ్మెల్యేలకు సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఈ పరిస్థితి ఉంటే బాపట్ల జిల్లాలోని 2 నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాలలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య సరైన సమన్వయం లేనట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటి జిల్లాలోని అనేక నియోజకవర్గాలలో టీడీపీ పరిస్థితిని నివేదిక రూపంలో సేకరించిన చంద్రబాబు పార్టీ శ్రేణులను నిర్లక్ష్యంగా చూసే ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ శ్రేణులు ఆ నియోజకవర్గాలలో నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు వాస్తవమని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.(Story:కేడర్ పట్ల నిర్లక్ష్యంపై చంద్రబాబు క్లాస్…..!)