వనదేవతలను దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ, మురళీధర్ రావు
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ములుగు జిల్లాలలో కొలువైన వనదేవతలు సమ్మక్క సారక్కలను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ బుధవారం దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖ-కొండా మురళీధర్ రావు దంపతులతో పాటు, వారి కూతురు సుస్మిత పటేల్, అల్లుడు అభిలాష్, మనవడు శ్రీయాన్ష్ మురళీకృష్ణతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించారు. తమ మనవడి తలనీలాలు సమర్పించిన అనంతరం సమ్మక్క సారక్కల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క పూజారులు మంత్రికి అమ్మవార్ల చీరె, పసుపు కుంకుమలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించే దాకా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు వదలదని మంత్రి సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చేపట్టిన జాతరను దిగ్విజయవంతంగా చేపట్టిందని గుర్తు చేశారు. దేవాదాయ శాఖ తరఫున మంత్రిగా తాను, గిరిజన బిడ్డ, మంత్రి సీతక్క సమ్మక్క సారక్క జాతర ప్రాంత అభివృద్ధి కోసం, సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. తమ కులదైవమైన సమ్మక్క సారక్కలను ప్రతియేడు దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నదమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనించాలనీ, రాష్ట్ర ఆర్థిక కష్టాలు గట్టెక్కాలనీ మంత్రి సురేఖ ప్రార్థించారు. రాష్ట్ర ప్రదాత అయిత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశయాల సాధనకు వనదేవతలు శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు కాక వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. (Story : వనదేవతలను దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ, మురళీధర్ రావు)