సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
న్యూస్‌తెలుగు/ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : సిర్పూర్ పేపర్ మిల్లు ప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సమస్యలను సమన్వయంతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో ఎస్.పి. డి.వి. శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి సిర్పూర్ పేపర్ మిల్లు ప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. పేపర్ మిల్లు ప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య నెలకొన్న సమస్యల సంబంధిత అంశాలపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కంపెనీ నిర్వహణ దృష్ట్యా సిర్పూర్ పేపర్ మిల్లు ప్రతినిధులు స్థానిక లారీ యజమానులకు పని కల్పించాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇరువర్గాలు సమన్వయంతో చర్చించుకొని రవాణా ధరలను నిర్ణయించుకోవాలని, మిల్లు అభివృద్ధితో పాటు లారీ యజమానులు లబ్ధి పొందేలా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డి. ఎస్. పి. లు, సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప, ఎస్. పి. ఎం. ప్రతినిధులు, లారీ అసోసియేషన్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి)