విజయనగర ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలు
క్రీడానైపుణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తాం
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
పలు ఉత్సవ వేదికల పరిశీలన
న్యూస్ తెలుగు/ విజయనగరం : విజయనగరం జిల్లా ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మన వైభవాన్ని దశదిశలా చాటేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి మంత్రి శ్రీనివాస్ ఉత్సవ వేదికలను మంగళవారం పరిశీలించారు. ముందుగా విజ్జీ స్టేడియంను సందర్శించారు. నూతనంగా నిర్మితమైన మల్టీపర్సస్ ఇండోర్ స్టేడియంను పరిశీలించి, ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. విద్యుత్ సదుపాయం కోసం 160 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. స్కేటింగ్ ట్రాక్‌ను, వాలీబాల్ కోర్టును, పోటీలు నిర్వహించే క్రీడామైదానాన్ని, క్రికెట్ స్టేడియంను పరిశీలించారు.ఫ్లడ్ లైట్లు, నెట్లను ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేడియం నుంచి స్కేటింగ్ ట్రాక్‌కు మెట్లు నిర్మించాలని సూచించారు. కోట వెనుకభాగంలో జరుగుతున్న సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. అక్కడ లేజర్‌షో ద్వారా విజయనగరం చరిత్రను వివరించనున్నట్లు ఎంఎల్ఏ తెలిపారు. ఆ ప్రాంతాన్ని అందంగా, అహ్లాదకరంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. అనంతరం మాన్సాస్ గ్రౌండ్‌లోని సరస్ డ్వాక్రా ఎగ్జిబిషన్ ఏర్పాట్లను పరిశీలించారు. పుష్పప్రదర్శన స్టాల్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలను సందర్శించారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది రాకుండా అక్కడ స్థలాన్ని చదునుచేసి, సిద్దం చేయాలని మంత్రి సూచించారు. ఈనెల 10వ తేదీన ప్రారంభం కానున్న అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్) పోస్టర్లను, పాంప్లేట్లను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.
ఖ్యాతి ఇనుమడించేలా
విజయనగరం జిల్లా ఖ్యాతి ఇనుమడించేలా, గత వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్తరాంధ్రస్థాయి క్రీడాపోటీలను విజ్జీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడా సౌకర్యాలతోపాటు, క్రీడాకారులకు వసతి సౌకర్యాలను కల్సిస్తున్నామని చెప్పారు. మైదానానికి చేరుకొనేందుకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియంను త్వరలో క్రీడామంత్రి చేత ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. దాదాపు 95 శాతం నిర్మాణం పూర్తయిన ఈ ఇండోర్ స్టేడియంను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, గత ఐదేళ్లలో ప్రారంభించలేకపోయిందని విమర్శించారు. జిల్లాల ఏర్పాటైన క్రీడా పాఠశాలను కడప తరలించుకుపోయినా, అప్పటి నాయకులు ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు, క్రీడా పాఠశాలను జిల్లాకు తిరిగి రప్పిచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. విద్యార్దులు, యువత క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని మంత్రి కోరారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విజ్జీ స్టేడియం
అంతర్జాతీయ ప్రమాణాలతో విజ్జీ స్టేడియంను తీర్చిదిద్ది, పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎంఎల్ఏ అదితి గజపతిరాజు చెప్పారు. 1985లో విజ్జీ స్టేడియంను ప్రారంభించారని, అప్పట్లోనే ఎంతో దూరదృష్టితో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పిపిపి విధానంలో ఈ స్టేడియంను అభివృద్ది చేసేందుకు సంకల్పించారని తెలిపారు. యువత తమ క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొనేందుకు, పోలీస్, ఆర్మీ, రిక్రూట్‌మెంట్లకు సిద్దం అయ్యేందుకు ఈ స్టేడియం ఎంతగానో దోహదం చేస్తోందని చెప్పారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, ఎపిఈపిడిసిఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, ఏపిడి సావిత్రి, జిల్లా క్రీడాభివృద్ది అధికారి వెంకటేశ్వర్రావు, ఉత్సవ కమిటీ సభ్యులు ఐవిపిరాజు, ఇతర అధికారులు, కోచ్‌లు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. (Story : విజయనగర ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలు)