పురుగుమందుల నకిలీ బ్లాక్‌మార్కెట్ మాఫియా తాట తీయండి
కలెక్టర్ అరుణ్‌బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ
వినుకొండకు సరిపడినంత డీఏపీ కేటాయించాలని ఉన్నతాధికారులను కోరిన జీవీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలకలంగా మారిన ఎరువులు, పురుగుమందుల నకిలీ, కల్తీ, బ్లాక్‌మార్కెట్ మాఫియా తాటతీయాలని అధికారులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. రైతులకు నష్టం జరిగే ఏ పనినీ ఈ ప్రభుత్వం సహించదు, చర్యలు కఠినంగా ఉంటాయనే సందేశం అందరికీ చేరాలన్నారు. అందుకోసం అవసరమైతే లైసెన్స్‌ల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనకాడొద్దని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. ఇదే విషయంపై మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో ఆయన మాట్లాడారు. ఇప్పటి మొదలు వ్యవసాయ సీజన్ ముగిసే వరకు జిల్లావ్యాప్తంగా ఎరువులు అధిక ధరలకు అమ్మేవారు, పురుగుమందులు నకిలీ, కల్తీ చేసే వారు భయపడేలా కొరడా ఝళిపించాలన్నారు. ఎరువులకు సంబంధించి నిల్వలపై తనిఖీలు చేసి మార్కెట్లో కొరత లేకుండా చూడాలన్నారు. ఎరువుల అక్రమ నిల్వలు, నకిలీ ఎరువులు, అనుమతి లేని బయో ఉత్పత్తుల ఉనికి ఎక్కడ కనిపించినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు సమయానుగుణంగా అవసరమైన రసాయనిక ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచింంచారు. వినుకొండకు సరిపడినంత డీఏపీ కేటాయింపు చేయాలని రాష్ట్ర అధికారులతోనూ మాట్లాడటం జరిగిందన్నారు. డీఏపీ కొరత ఉన్నట్లు పలు మండలాల రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, వారికి సరిపడినంత డీఏపీ సరఫరా చేయాలని కోరారు. వినుకొండతో పాటు పల్నాడు జిల్లాలో మిర్చి, పత్తి, కంది ఎక్కువ సాగు చేస్తున్నందున నాణ్యతలేని పురుగుమందులు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకొని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, గ్రామస్థాయి వ్యవసాయ శాఖ సహాయకులతో గ్రామాల్లో నిఘా పెట్టి నకిలీలపై కఠినంగా ఉండాలన్నారు. వినుకొండ నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా నకిలీ, నిషేధిత పురుగు మందుల మాట వినిపించడానికి వీల్లేదని లక్ష్యంతో అంతా పనిచేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా అనుమతి లేకుండా మార్కెట్లోకి వస్తున్న బయో ఉత్పత్తులు ఎవరివి అయినా ఆలోచించకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే జీవీ. రైతులతో మాట్లాడి వారు ఇప్పటి వరకు వాడిన, వాడుతున్న మందులపై వివరాలు తీసుకోవాలని, పురుగుమందుల దుకాణాల్లో రిజిస్టర్లు తనిఖీ చేయాలన్నారు. ఏమాత్రం తేడా కనిపించినా ఆ దుకాణాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టా లన్నారు. రైతులు నష్టపోయినచోట్ల నకిలీ ఎరువులు, బయో ఉత్పత్తులు అమ్మిన వ్యాపారులపై కేసులు పెట్టి పరిహారం ఇప్పించాలని సూచించారు. పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రైవేటు ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చూచించారు. (Story : పురుగుమందుల నకిలీ బ్లాక్‌మార్కెట్ మాఫియా తాట తీయండి)