నేటి యువత, భావితరాలకు గాంధీజీ జీవితమే ఓ సందేశం
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత విగ్రహానికి ఎమ్మెల్యే జీవీ, మక్కెన నివాళులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : నేటి యువతరం, భావితరాలకు జాతిపిత మహాత్మాగాంధీ జీవితమే ఒక సందేశం, ఆదర్శం అని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అహింసా మార్గంలోనే పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన ఆయన తన వ్యక్తిత్వం, పోరాట స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి, ఎన్నో దేశాల అధినేతలకు అభిమాన నాయకుడు, ఆరాధ్యుడిగా నిలి చారని కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా వినుకొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద జాతిపిత విగ్రహానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. అనంతం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. మహాత్ముడికి భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు. తనకు ఆదర్శం గాంధీజీ అని, ఆయన వల్లే ఈ స్థాయికి ఎదిగానని స్వయంగా అమెరికా అధ్యక్షుడు చెప్పడాన్నీ గుర్తు చేశారు. సత్యమేవ జయతే నినాదంతో ధర్మాన్ని ఆచరించమని, ప్రోత్సహించమని, అహింసా మార్గంలోనే విజయం సాధించగలమని గాంధీ సందేశమిచ్చారన్నారు. అందుకే చరిత్ర ఉన్నంతకాలం గాంధీని ప్రపంచం మరిచిపోదన్నారు. అవమానాలు, అంటరానితనానికి కుంగిపోకుండా చైతన్య స్ఫూర్తితో అసమానతలు పోవాలని, మానవులంతా ఒక్కటేనని కులాలు, మతాలకు అతీత సమాజం రావాలని మహాత్ముడు కోరుకున్నారన్నారు. అదేస్ఫూర్తితో తెల్లవారిపై పోరాటం చేసి తరిమికొట్టారన్నారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి రాక్షస పాలనలో చంద్రబాబు కూడా ఎన్నో అవమానాలకు, ఇబ్బందులకు గురయ్యారని, జైలులో పెట్టినా ఆయన సతీమణి భువనేశ్వరిని అనరాని మాటలతో అవహేళన చేసి అవమానపరిచినా కుంగిపోకుండా, ధైర్యంగా పోరాడి రాక్షస పాలన తుదముట్టించారని తెలిపారు. గాంధీ ఆశయాలు, కార్యక్రమాలను సాధించాలని 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ విజయవంతంగా చేపట్టారని, గ్రామగ్రామాన మరుగుదొడ్లు, సిమెంట్ రహదారులు, సీసీ డ్రైన్లు నిర్మించి ప్రోత్సహించారని అన్నారు ఎమ్మెల్యే జీవీ. సుమారు 24 లక్షల మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలిపారన్నారు. రూ.22 వేల కోట్లతో సీసీ రహదారులు వేసి దేశంలోనే ఆదర్శంగా నిలబడ్డారని కొనియాడారు. అందులో భాగంగా మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి ఉండాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నారన్నారు. గాంధీ ఆశయ సాధన కోసం తెలుగుదేశం ప్రభుత్వం నడుం బిగించి కష్టపడుతుందని తెలిపారు. యువత కూడా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వాటి సాధన కోసం ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. మహానుభావులు మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి ఒకేరోజు పుట్టడం గొప్ప విశేషమన్నారు. పదవి కంటే నైతిక విలువలు ముఖ్యమని చాటిచెప్పిన మహానుభావుడు లాల్‌బహదూర్ శాస్త్రి అని అన్నారు. భావితరాల కోసం మహాత్మాగాంధీ, బహదూర్‌శాస్త్రి ఆశయాలను సాధించడానికి ముందుడు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ అయిబ్ ఖాన్, బిజెపి నాయకులు మేడా రమేష్, టిడిపి నాయకులు పివి సురేష్ బాబు ,పత్తి పూర్ణచందర్రావు, సీనియర్ న్యాయవాదులు నలబోలు రామ కోటేశ్వరరావు, పొట్లూరు సైదారావు, రొడ్డ వీరాంజనేయరెడ్డి, గట్టుపల్లి శ్రీనివాసరావు, మోటమర్రి నరసింహారావు, సోమేపల్లి శ్రీనివాసరావు, చికెన్ బాబు,పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story : నేటి యువత, భావితరాలకు గాంధీజీ జీవితమే ఓ సందేశం)