ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి
మండల విద్యాధికారి గోపాల్ నాయక్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రతీ విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని , తద్వారా మూఢనమ్మకాలను నిర్మూలించాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన మండలస్థాయి పరీక్షల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ శాస్త్రవేత్తల ప్రాణ త్యాగం వల్లనే నేడు శాస్త్ర విజ్ఞానం అందించిన ఫలితాలను మనం అనుభవిస్తున్నామన్నారు. గెలీలియో, కోపర్నికస్, బ్రూనో లాంటి వాళ్ల త్యాగాల ఫలితంగా సూర్యకేంద్రక సిద్ధాంతం సత్యమని తేలిందన్నారు, మత చాందస వాదుల దాష్టీకానికి ఎంతో మంది శాస్త్ర వేత్తలు బలికావడం బాధాకరమన్నారు. డాక్టరు, ఇంజనీర్ మాత్రమే కాకుండా శాస్త్ర పరిశోధనల వైపు కూడా ఆలోచించాలన్నారు. అనాది గా వస్తున్న మూఢనమ్మకాలను విడిచిపెట్టి ఆధునిక, శాస్త్రీయ సమాజం నిర్మించడానికి విద్యార్థులే ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. జె వి వి జిల్లా ప్రధనకార్యదర్శి డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి గురి తప్పకుండా లక్ష్యాన్ని చేదించగల మిస్సైల్స్ నూ, జలాంతర్గాములను తయారు చేసిన సైన్స్ ఒక వైపు వుంటే, అదే సైన్స్ నూ ఉపయోగించుకుని మూఢనమ్మకాలను వ్యాప్తి చెయ్యడం శోచనీయం అన్నారు. పాలకులే పనిగట్టుకుని మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగంలోని 51 ఎ ని అపహాస్యం చేస్తూన్నారన్నారు.మూఢనమ్మకాలను ప్రచారం చెయ్యడం ద్వారా ప్రజల్లో అయోమయం శృష్టిస్తున్నారన్నారు. సైన్స్ కార్పొరేట్ల కబంధ హస్తాల్లో బందీ అయిపోవడం వల్ల సామాన్య ప్రజలకు సైన్స్ ఫలితాలు అందడం లేదన్నారు. సైన్స్ ఫలితాలు సామాన్యులకు చేరువ కావాలంటే ప్రజలు శాస్త్రీయ దృక్పథం కలిగిఉండాలన్నారు. హిందీ పండిట్ వేణుగోపాల్ మాట్లాడుతూ మూఢనమ్మకాలను లేని సమాజం కోసం ప్రయత్నం చేస్తున్న జె వి వి కృషిని అభినందించారు. విద్యార్థులు గెలుపోటములకు కృంగిపోకుండా ఇటువంటి పరీక్షలు రాసినప్పుడే భవిష్యత్తు లో ఉన్నత స్థానానికి చేరుకుంటారన్నారు.
సీతారామయ్య మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నే ఈ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు .
మాజీ మండల విద్యాధికారి రాజశేఖర్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం లో నరేంద్ర బాబు, ఖలందర్ సైన్స్ ఉపాద్యాయులు , గోపి, శేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి)