ఉప్పరపాలెం నిరుపేదలకు 3 సెంట్లు స్థలం ఇచ్చి, గృహాలు నిర్మించి ఇవ్వండి
న్యూస్‌తెలుగు/వినుకొండ : దశాబ్దాల కాలంగా పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వవలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కోరారు. సోమవారం నాడు వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామ నివాసులతో కలిసి, స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ. గత 30 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆదేశాలతో ఆనాటి స్థానిక శాసన సభ్యులు గంగినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిర్మించి ఇచ్చిన తాటాకుల పూరి ఇళ్లలోనే వారు ఈనాటికీ నివసించుచున్నారని, ఆనాటి నుంచి నేటి వరకు ఒక్కొక్క కుటుంబంలో పుట్టిన పిల్లలు పెరిగిన వారి సంసారాల నేపథ్యంలో కొడుకులు కూతుళ్లకు పెళ్లిళ్లు అయినప్పటికీ అదే ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఒదిగి జీవిస్తున్న పరిస్థితి దయనీయమని ఆయన అన్నారు. గత పాలకులు వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పేదల పట్ల దయ చూపించకుండా ఒక సెంటు ఇంటి స్థలం కూడా కేటాయించకుండా వారిని ఇబ్బందులు పాలు చేశారని ఆయన విమర్శించారు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబానికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి నాలుగున్నర లక్షల ఇంటిలోనూ కేటాయిస్తామని ప్రకటించి ఉన్నందున ఉప్పరపాలెం గ్రామ నిరుపేదలందరికీ మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి పక్కా గృహములు నిర్మించి ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. దశాబ్దాలు మారినా నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగుపడటం లేదని దానికి ఉదాహరణ వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామంలోని నిరుపేదలు ఎన్ని అర్జీలు పెట్టినా గత వైసీపీ ప్రభుత్వంలో ఒక సెంటు కూడా ఇంటి స్థలం కేటాయించకుండా పక్కా గృహాలు నిర్మించకుండా అగచాట్ల పాలు చేశారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 32 లక్షలు ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇస్తున్నానని చెప్పారని, ఆ ఇళ్ల స్థలాల కొరకు 7000 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని, కానీ వినుకొండ పట్టణం తప్ప ఒక్క గ్రామంలో కూడా పేదవాళ్ళకి జగనన్న ఇల్లు ఇవ్వలేదని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ మైనా ఈ నిరుపేదలకు ఇళ్లస్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. ధర్నా అనంతరం తాసిల్దార్ కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, చీరాల అంజయ్య, తిరుమల దుర్గమ్మ, రూతమ్మ, రాహేలమ్మ, ఎద్దు ఈశ్వరమ్మ, కొండమ్మ, గోవిందమ్మ, ఎద్దు శీను, గోవిందు, ప్రమీలమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. (Story : ఉప్పరపాలెం నిరుపేదలకు 3 సెంట్లు స్థలం ఇచ్చి, గృహాలు నిర్మించి ఇవ్వండి)