ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి
స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ
జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.
న్యూస్ తెలుగు /ములుగు : స్వయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలి తుది ఉద్యమకారులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సంక్షేమ భవనం లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా
కలెక్టర్ దివాకర టి.ఎస్. జ్యోతి ప్రజలను చేసి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఆయన ప్రాథమిక విద్యను, అదే గ్రామంలో కొనసాగించి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ చేరారని, ఆ సమయంలోనే స్వాతంత్రం కోసం నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని వివరించారు. బ్రిటిష్ కాలంలో ఎన్ని శిక్షలు వేసినా భయపడకుండా పోరాటంలో ముందుకు సాగారని, విద్యార్థి దశలోనే అనేక కష్టాలు వచ్చినప్పటికీ పోరాట ప్రతిభను తగ్గించలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. బీసీ కులాల వర్గీకరణ జరిగిన పక్షంలో బీసీ కులాల అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపు నిచ్చారు. గొప్ప నాయకులను ఆదర్శంగా తీసుకొని వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలతో ముందుకు కొనసాగాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సిహెచ్. రవీందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, పద్మశాలి కుల సంఘం నాయకులు డిపి జనార్ధన్, గుర్రపు శ్రీధర్, చిందం రాజమల్లు, కందగట్ల సారయ్య, బీసీ కులాల సంఘ నాయకుడు ముంజాల బిక్షపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి)