UA-35385725-1 UA-35385725-1

ప‌వ‌ర్‌స్టార్ ఫైర్: లౌకిక వాదం వన్ వే కాదు టూ వే!

ప‌వ‌ర్‌స్టార్ ఫైర్: లౌకిక వాదం వన్ వే కాదు టూ వే!

• సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే కచ్చితంగా మాట్లాడతాము
• సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం
• సనాతన ధర్మానికి హాని కలిగితే హిందువులందరూ కలసికట్టుగా మాట్లాడాలి… మౌనం మంచిది కాదు
• లడ్డూ అపవిత్రంపై వైసీపీవాళ్ళ మాటలు మరింత వేదన కలిగిస్తున్నాయి
• తప్పును ఒప్పుకోకుండా బుకాయింపులతో కాలం గడపాలని చూస్తున్నారు
• ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనుకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం
• కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

న్యూస్‌తెలుగు/విజ‌య‌వాడ: ‘పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రం జరిగితే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా’రని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులో తప్పు జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులు ప్రమేయం మీద మాట్లాడాలి.. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా కలసికట్టుగా మాట్లాడాలని.. మౌనం వహిస్తే … ఆ మౌనం మన భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం మెట్లను కడిగి శుభ్రం చేశారు. పసుపు రాశారు. కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “అన్ని మతాలు, అన్ని ధర్మాలు, అన్ని విశ్వాసాలను సమానంగా గౌరవించే నేల మనది. కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ అపవిత్రం అయితే వైసీపీ నాయకులు బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారు. గతంలో దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైన సందర్భంగా ఆ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ వెండి సింహాలతో మేడలు, మిద్దెలు కట్టుకుంటామా అంటూ మాట్లాడడం చాలా బాధ కలిగించింది. ఆ రోజు మాట్లాడింది క్రైస్తవులో, మరొకరో కాదు. చేతులకు తాళ్ళు కట్టుకొని, బొట్లు పెట్టుకొనే హిందువులే. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోండి. లేకపోతే సంబంధం లేదని చెప్పండి. అంతే తప్ప సనాతన ధర్మంపై ఇష్టానికి మాట్లాడితే ఊరుకునేది లేదు.


• వైసీపీ పాలనలో వందల ఆలయాలు ధ్వంసం
వైసీపీ హయాంలో వందలాది ఆలయాలను ధ్వంసం చేశారు. దేవతల విగ్రహాలను అపవిత్రం చేశారు. రామ తీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే సంయమనం పాటించాను తప్ప సత్తా ఉన్నా రోడ్డు మీదకు రాలేదు.
ఈ దేశంలో సెక్యులరిజం అనేది వన్ వే కాదు. రెండు వైపుల నుంచి ఉండాలి. ఇతర మతాల ఆచారాలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో హిందువుల మనోభావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, ధర్మాలకు విఘాతం కలిగినా అంతే స్థాయిలో స్పందించాలి. ఈ దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులున్నాయి. నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను. తిరుమల ఘటన లాంటి ఘటన ఏ మసీదులోనో, చర్చిలోనో జరిగితే ఇలానే మాట్లాడతారా? ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్ల మీదకు వచ్చి కొడతారని భయం. వారి ఓట్లు పోతాయని భయం. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయనపై ఎంతో గౌరవం ఉంది. అయితే సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? ఇదే తప్పు ఓ మసీదుకు లేదా చర్చికి జరిగితే ఇలాగే మాట్లాడతారా..? దేశంలో హిందువులకు ఏం జరిగినా సరే మాట్లాడే హక్కు ఉండకూడదా.? మా హిందూ దేవతలపై ఇష్టానుసారం వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారిపై రకరకాల జోకులు వేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలి.. మా మనోభావాలు దెబ్బ తిన్న నోరు మూసుకొని ఉండాలి అనడం ధర్మమేనా..? ఇదేనా మీరు చెబుతున్న లౌకికవాద ధర్మం.
ప్రకాశ్ రాజ్ గారే కాదు ఆయనతోపాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. సాటి హిందువులను తోటి హిందువులు తూలనాడడం మానుకోవాలి. హిందువులంతా సనాతన ధర్మానికి ఏ మాత్రం విఘాతం కలిగినా కలిసికట్టుగా ముందుకు రావాలి. భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.


• పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు
లడ్డూ అపవిత్రం అయిందని మేము మాట్లాడితే హైకోర్టు ఏజీపీగా పని చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదం ఎక్కిన మాటలు మాట్లాడుతున్నారు. పంది కొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని దాన్ని సాధారణ నెయ్యిలో ఎలా కలుపుతారు అంటూ చాలా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. బంగారంలో రాగి కలుపుతారుగానీ రాగిలో బంగారం కలపరు… రాగి చెంబు తయారీలో బంగారం కలపరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా హిందువే. హిందూ ధర్మం పాటించే ప్రజలు ఎంత పవిత్రంగా భావించే లడ్డుకి అపచారం జరిగితే సాటి హిందువుగా ఇలాంటి మాటలు మాట్లాడడం దారుణం. భక్తుల మనోభావాలను మరింత దెబ్బ కొట్టేలా ఈ మాటలు ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే రికార్డులు నాకు పంపించండి అన్ని అడుగుతున్నారు. మీ హయాంలో తప్పు జరిగితే దానికి సంబంధించిన ఫైల్స్ మీకు ఇవ్వాలా..? మీ హయాంలో ఇలాగే ఇచ్చారా..? కరుణాకర రెడ్డి తిరుమలలో పెద్ద యాక్టింగ్ చేశారు. తిరుమలలో ఏదైనా అపచారం జరిగితే కుటుంబాలు నాశనం అవుతాయని ఆయనే శపథం చేశారు. మీ నాశనం మొదలైంది.. మిగతాది పైన ఉన్న దేవుడే చూసుకుంటాడు. ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి గాయబ్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన హయాంలో తిరుమలను వ్యాపార, పర్యాటక కేంద్రంగా మార్చారు. ధర్మారెడ్డి కొడుకు చనిపోతే కనీసం 11 రోజులు కూడా ఆలయంలోకి వెళ్లకుండా ఉండలేకపోయారు. ఆగమశాస్త్రం పాటించే తిరుమలలో ఆయన ఇష్టానుసారం ప్రవర్తించారు.


• జగన్ నియమించిన బోర్డులో తప్పులు జరిగాయి
వైవీ సుబ్బారెడ్డి గారు, కరుణాకర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మతం పుచ్చుకున్నారో లేదో నాకు తెలియదు. హైందవ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నారు. కాపాడాల్సిన అవసరం ఉంది. తప్పులు జరిగినప్పుడు బాధ్యత తీసుకొని ఒప్పుకోవాలి. ఆ బోర్డులను నియమించింది జగన్ రెడ్డి గారు. ఆయన బాధ్యత తీసుకొని చెప్పాలి. తప్పులు జరిగాయని ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు ఉన్నాయి. మేమేమీ ఆటలు ఆడటం లేదు.


• హిందువులకు చేతులెత్తి మొక్కుతున్నాను
హిందువు అనే వాడికి ఈ దేశంలో భయం ఉండదు. అలాగే ఇతర మతాలపై ద్వేషం ఉండదు. హిందువులకు కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. బయటకు రండి. సనాతన ధర్మ రక్షణ కోసం తుది వరకు పోరాడుతాను. అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధం. మనం పాటించే మత ధర్మానికి విఘాతం కలిగినప్పుడు కచ్చితంగా దానిపై ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై ఉంది. సనాతన ధర్మాన్ని ఎంతో హుందాగా వచ్చే తరానికి అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. మన మౌనం ధర్మ వినాశనానికి దారి కాకూడదు.
సినిమా ఇండస్ట్రీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారం జోకులు వేయడం దాన్ని మీమ్స్ చేయడం సరికాదు. నిన్న ఓ సినిమా ఫంక్షన్ లో కూడా ఇలాగే జోకులు వేస్తున్నారు. సీరియస్ అంశాలను, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడండి.’’ అని కోరారు.


• పవన్ కళ్యాణ్ కి పూర్ణ కుంభంతో స్వాగతం
తిరుమల లడ్డూ అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ శుద్ధి కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి నడక మార్గంలో వచ్చే మెట్లను పవన్ కళ్యాణ్ గారు కడిగి, శుభ్రం చేసి పసుపు, కుంకుమ పెట్టారు. అనంతరం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కి ఆలయంలోనే వేదపండితులు ఆశీర్వచనం అందించి దీవించారు.
• హిందువుల మనోభావాలు పట్టవా?: కేశినేని శివనాథ్, విజయవాడ ఎంపీ
ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ గారు మాట్లాడుతూ “వైసిపి నాయకులకు హిందువులు మనోభావాలు అంటే చిన్న చూపు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డులో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయన్న వార్త ప్రపంచంలో హిందువులందరి మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ పాపాలు సాక్ష్యాలతో బయటకు వచ్చినా అడ్డుగోలుగా దబాయించాలని చూస్తున్నారు” అన్నారు.


• తిరుమల లడ్డూ పరమ పవిత్రంగా భావిస్తాం: వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ
ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు మాట్లాడుతూ ‘‘తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆయనకు నివేదించిన లడ్డూను అంతే పవిత్రంగా చూస్తాం. లడ్డూ అంటే భక్తులకు అంత సెంటిమెంటు. అలాంటి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీ పాలకుల తప్పిదాలను ప్రజలు మర్చిపోరు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ పాలన సాగింది. టీటీడీ అధికారులు చేసినదాన్ని తప్పిదం అనకూడదు. అది మహా పాపం. తప్పు బయటపడిన తర్వాత కూడా వైసీపీ నాయకులు అడ్డగోలుగా వాదనలు చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే.. వైసీపీ నాయకులు చేసిన తప్పుకు కనీసం బాధపడకపోవడం శోచనీయం’’ అన్నారు.
• పరమత సహనం పవన్ కళ్యాణ్ విధానం: పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ
శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ‘‘సనాతన ధర్మాన్ని పాటిస్తూ… పరిమత సహనాన్ని చూపించే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇంత అపవిత్రం అయిందనే విషయం తెలుసుకొని ఎంతో ఆవేదన చెందారు. సగటు భక్తుడిగా కలత చెందారు. ఇలాంటి విషయాలపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత వేదనకు గురి చేస్తున్నాయి. ప్రతి హిందూ ఈ సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, బాడిత శంకర్, కూటమి నేతలు పాల్గొన్నారు. (Story: ప‌వ‌ర్‌స్టార్ ఫైర్: లౌకిక వాదం వన్ వే కాదు టూ వే!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1