పత్రికా విలేఖరి కుటుంబానికి చేయూతనందించిన బీజేపీ నాయకులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలో అరుణ ప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్న ఖాదర్ బాషా ఇటీవల అనారోగ్య కారణంగా ఆపరేషన్ చేయించుకొని ఇంటికే పరిమితం అవ్వడంతో, ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే, కుటుంబ సంక్షేమం, వైద్యారోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసికెళ్ళి తమ తోటి పాత్రికేయుని అనారోగ్య పరిస్థితి, కుటుంబ పోషణ భారం తదితర వివరాలు తెలియజేయడం జరిగింది.
అందుకు స్పందించిన మంత్రివర్యులు తప్పకుండా సాయం అందిస్తామని కొన్ని రోజుల కిందట హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆ పాత్రికేయ కుటుంబానికి రెండు నెలల నిత్యావసర సరుకులు ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు జానపాటి మోహన్ కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం బీజేపీ పార్టీ కార్యాలయ ఇంచార్జి హరీష్, బీజేపీ పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జి. ఎం. శేఖర్, బీజేపీ నాయకులు డోలా రాజారెడ్డి మాట్లాడుతూ విలేఖరి ఖాదర్ బాషా కుటుంబానికి మేం అందిస్తున్న ఈ చేయూతను బాధ్యతగా భావిస్తున్నామని, ధర్మవరం పట్టణంలోని విలేఖరులకు తాము ఎప్పుడూ అండగా వుంటామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు.తమ కుటుంబానికి సహాయం అందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్, బీజేపీ పార్టీ నాయకులకు, ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటీ కి ఖాదర్ బాషా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : పత్రికా విలేఖరి కుటుంబానికి చేయూతనందించిన బీజేపీ నాయకులు)