స్వర్ణాంధ్ర ఏ 2047 మిషన్‌లో భాగస్వాములు కండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన
న్యూస్ తెలుగు/విజయవాడ : స్వర్ణాంధ్ర ఏ 2047 దార్శనికత పత్రం ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు వాతావరణ సుస్థిరతపై దృష్టిసారిస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత్‌కు ఓ పెద్ద వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించే ప్రణాళికని జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తెలిపారు. నవంబర్ 1న ఈ పత్రాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోందని ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సీపీవో వై.శ్రీలతతో కలిసి సోమవారం స్వర్ణాంధ్ర ఏ 2047 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఏ2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సంబంధించి ప్రజలతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు, సలహాలు, స్పందనను తీసుకోవడం జరుగుతోందన్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను అందించాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ నుండి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు పంచుకోవాలని సూచించారు. అధిక విలువ కలిగిన వ్యవసాయ, ఆహార శుద్ధి పవర్ హౌస్‌గా మార్చడం, స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ, సుస్థిర ప్రభుత్వం-డిజిటల్ సుపరిపాలన, వాతావరణ ప్రాధాన్యతగా అభివృద్ధి విధానం, సాంకేతికతతో కూడిన అందుబాటులో వైద్యం, నైపుణ్యం పెంపుదల తదితర అంశాలు ప్రాధాన్యతగా దార్శనిక పత్రం రూపొందుతోందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, వ్యాపార, వాణిజ్య అసోసియేషన్ల కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలకు అవగాహన కల్పించి, అభిప్రాయాలు పంచుకునేలా పోస్టర్లతో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. (Story : స్వర్ణాంధ్ర ఏ 2047 మిషన్‌లో భాగస్వాములు కండి) విజయవాడ