గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవాన్ని పొందిన
పద్మవిభూషణ్ చిరంజీవి
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా : 46 వసంతాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అద్భుతమైన ప్రతిభావంతుడు కొణిదెల శివశంకర వరప్రసాద్.. ఇప్పుడు ఆయన మెగాస్టార్. మెగాబాస్. అందరికీ అన్నయ్య… ది గ్రేట్ చిరంజీవి. ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఒక్కో సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ, అచంచలమైన ప్రతిభను ప్రదర్శిస్తూ, అనితరసాధ్యమైన ఎత్తులను చేరుకుంటూ మెగాస్టార్‌గా, తరతరాలకు స్ఫూర్తి పంచే ట్రూ ఐకాన్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఆనందాన్ని అభిమానులు ఆస్వాదిస్తూ ఉండగానే, ఆయనకు మరో అరుదైన పురస్కారం దక్కింది. సెప్టెంబర్ 22, 2024న గిన్నిస్ వరల్డ్ రికార్డులో చిరంజీవి పేరు చేరింది. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని యాక్టర్, డ్యాన్సర్ కేటగిరీలో ఆయన స్థానం సంపాదించారు. 1978లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఏడాదే మొదలైన రికార్డుల పుస్తకంలో ఆయన పేరు చోటు చేసుకోవడం యాదృచ్చికమే అయినా అందమైన అనుభూతిగా భావిస్తున్నారు అభిమానులు.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా దాదాపు 24వేల డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఆయన కెరీర్‌లో 537 పాటల్లో ఈ డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా 156 సినిమాల కెరీర్ ఆయనది. ఇన్నేళ్ల కెరీర్‌లో అనితర సాధ్యమైన ప్రతిభతో, తెలుగు వారందరూ గర్వించేలా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు.
ఇప్పటికీ చైనాలో మెగాస్టార్ చిరంజీవిని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనే పిలుస్తారు.
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించే కార్యక్రమం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో వైభవంగా జరిగింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తరఫున రిచర్డ్ స్టెన్నింగ్ పాల్గొన్నారు.
అడ్జుడికేటర్ – జీ డబ్ల్యు ఆర్ మిస్టర్ రిచర్డ్ స్టెన్నింగ్ మాట్లాడుతూ `చిరంజీవిగారి 46 ఏళ్ల సినిమా ప్రయాణం గురించి మీ అందరికీ బాగా తెలుసు. కమర్షియల్‌గా రిలీజ్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నాం. చిరంజీవి గారు 156 సినిమాల్లో నటించారు. అన్ని సినిమాలు చేయడమే అద్భుతమైన అచీవ్‌మెంట్. ఆ సినిమాల్లో ఆయన డ్యాన్స్ చేసిన పాటలను తీసుకున్నాం. అన్ని పాటలను చూడటం వ్యక్తిగతంగానూ నాకు చాలా మంచి అనుభూతి. చరిత్రలో నిలబడిపోయే వ్యక్తి ఆయన. 537 పాటల్లో ఆయన స్టెప్పులను చూశాం. ఆయనకు గిన్నిస్ రికార్డు అందించాలని నిర్ణయించుకున్నాం` అని అన్నారు.
ఆమీర్‌ఖాన్ మాట్లాడుతూ `ఇవాళ ఇక్కడ ఉండటం ఆనందంగా, గౌరవంగా ఉంది. చిరంజీవి అభిమానులను కలవడం ఆనందంగా ఉంది. చిరంజీవిని అన్నయ్యగా భావిస్తాను. ఆయనకు నేను కూడా పెద్ద అభిమానిని. చిరంజీవిగారు నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన నాతో అలా ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఆయనకు ఒకటే చెప్పాను.. `సార్ మీకు నాకు ఆర్డర్ వేయండి. వచ్చేస్తాను. మీరు నన్ను అడగకండి అని. చిరుగారు గిన్నిస్ విషయం నాతో చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చేసిన ప్రతి పాటలోనూ ఆయన మనసు కనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేసి చేస్తారు. ఆయన్ని చూడ్డానికి మనకు రెండు కళ్లు సరిపోవు. అంత బాగా చేస్తారు. అది అరుదైన లక్షణం. ఆయన ఎన్నో సాధించారు. ఈ ప్రయాణంలో ఆయన ఇంకా ఎంతో దూరం సాగాలి“ అని అన్నారు.
నేను ఫస్ట్ పిక్చర్‌కి వెళ్లినప్పుడు నా రూమ్‌లో సరదాగా నేను డ్యాన్సులు వేసుకునేవాడిని. అక్కడున్న కో స్టార్స్ అందరూ చిరంజీవి చాలా బాగా డ్యాన్సులు వేస్తాడని అందరికీ చెప్పేవారు. సావిత్రి, రోజా రమణి, కవిత, నరసింహరాజు అందరూ ఓ రోజు సాయంత్రం కూర్చున్నారు. రాజమండ్రి పరిసరాల్లో ఓ పల్లెటూరిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ పంచలో ఉన్నారందరూ. అక్కడ లైట్‌గా వర్షం పడుతోంది.. అక్కడ డ్యాన్స్ చేయమని నన్ను అడిగారు. ఎవరైనా అడగడమే తరువాయి అన్నట్టు డ్యాన్సులు చేసేవాడిని. పంచలో వర్షానికి కాలు జారి కిందపడ్డాను. అయినా ఆపలేదు. దాన్ని నాగిణి డ్యాన్సులాగా మార్చేసి స్టెప్పులేశాను. అక్కడున్నకో డైరక్టర్ దాన్ని చూసి క్రాంతికుమార్‌గారికి చెప్పారు. ప్రాణం ఖరీదులో వాళ్లు బుక్ చేసుకున్నప్పుడు ఓ కేరక్టర్‌కి ఓ పాటను అనుకుని సెట్ చేశారు. అలా ఏలియల్లో ఏలియల్లో ఎందాక… అనే పాటను పెట్టారు. ఆ పాటకు స్టెప్ వేశాను. ఫస్ట్ టైమ్ యాక్టర్‌గా స్క్రీన్ మీద డ్యాన్సు చేశాను. దానికన్నా ముందు పునాదిరాళ్లులోనూ డ్యాన్స్ వేస్తూ, ఫ్రెండ్స్ మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్నాను. నా డ్యాన్స్ స్కిల్ నాకు ఎక్స్ ట్రాగా ఉపయోగపడింది.
ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వనీదత్, కె.ఎస్.రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్ బాబు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, సురేందర్ రెడ్డి, గుణశేఖర్, మల్లిడి వశిష్ట, బాబీ, మెగాస్టార్ కుటుంబసభ్యులు సుష్మిత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. (Story : గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవాన్ని పొందిన పద్మవిభూషణ్ చిరంజీవి)