శానిటేషన్ వర్కర్లకు వేతనాలను మంజూరు చేయండి
సిఐటియు నాయకులు
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలను వెంటనే మంజూరు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు సిఐటియు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జేవి రమణ, అయూబ్ ఖాన్, ఆదినారాయణ, మారుతి తదితరులు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబ జీవనం ప్రశ్నార్ధకంగా మారిందని, వారు ఎలా జీవిస్తారని వారు ప్రశ్నించారు. కుటుంబ పోషణ భారంగా మారిందని అతి తక్కువ వేతనాలతో కుటుంబాలు గడవడం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలని టాయిలెట్స్ ఏర్పాటు చేసి వాటి శుభ్రత కోసం స్వచ్ఛభారత్ కార్మికులను నియమించడం జరిగిందని వారు గుర్తు చేశారు. మరి అటువంటి వారికి జీతాలు ఇవ్వకపోతే వారి జీవనం ఎలా కొనసాగుతుందని మరోసారి ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం అమలు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు లక్ష్మీదేవి, నాయకురాలు రమణమ్మ, అంజనమ్మ, వరలక్ష్మి, మంగమ్మ, సుబ్బరత్నమ్మ, పర్యాన తదితరులు పాల్గొన్నారు. (Story : శానిటేషన్ వర్కర్లకు వేతనాలను మంజూరు చేయండి)