రౌడీషీటర్ల ప్రవర్తన, నేర చరిత్ర ఆధారంగా వారిపై నిఘా పెట్టాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
దర్యాప్తులో ఉన్న గంజాయి, మిస్సింగు, ఎస్సీ ఎస్టీ, పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సమీక్షించిన జిల్లా ఎస్పీ
న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్, సెప్టెంబరు 20న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – విధి నిర్వహణలో భాగంగా ప్రతీ ఒక్కరూ నీట్ యూనిఫారం ధరించడంతోపాటు, లాఠీని తప్పనిసరిగా తమ వెంట తీసుకొని వెళ్ళాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. స్టేషనుకు వచ్చే ఫిర్యాదులను రిసెప్షన్ రిజిష్టరులో నమోదు చేయాలని, డయల్ 100 ఫిర్యాదులపై సకాలంలో స్పందించి, సాధ్యమైనంత వేగంగా సంఘటనా స్థలంకు చేరుకొని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేయాలని, ప్రతీ బీటును పర్యవేక్షణ అధికారులు కనీసం మూడుసార్లు తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎటిఎం కేంద్రాల్లో నేరాలు జరగకుండా, నిఘా పెట్టాలని, ప్రతి ఎటిఎం కేంద్రంలో పాయింట్ బుక్కు ఏర్పాటు చేసి, గస్తీ తిరిగే అధికారులు, సిబ్బంది పాయింట్ బుక్కులో సంతకాలు చేయాలన్నారు. రాత్రి పెట్రోలింగు నిర్వహించే సిబ్బంది ఆకస్మికంగా వాహన తనిఖీలు చేయాలని, లాడ్జిలు, రైల్వే స్టేషనులు, బస్టాండులు, ముఖ్య కూడళ్ళలో తనిఖీలు నిర్వహించి, అనుమానస్పద వ్యక్తుల గురించి ఆరా తీయాలని, వారి వేలి ముద్రలను మొబైల్ వేలిముద్రల డివైజ్ తో తనిఖీ చేసి, వారికి నేర చరిత్ర ఉన్నది? లేనిది? తెలుసుకోవాలన్నారు. రాత్రి 11 గంటల తరువాత సహేతుకరమైన కారణం లేకుండా బయట తిరగకుండా చూడాలని, అలా తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలని, కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల గురించి సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, వారి ప్రస్తుత నడవడిక గురించి ఆరా తీసి, రికార్డుల్లో నమోదు చేయాలని, వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తులను వారి ప్రవర్తన, చెడు నడతను బట్టి మూడు క్యాటగిరిలుగా విభజించి, వారిపై నిఘా పెట్టాలన్నారు. ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది గ్రామ సందర్శనలు చేయాలని, స్థానికులతో గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితులు, సమస్యలు, క్రొత్త వ్యక్తులు, చెడు నడత కలిగిన వారి గురించి గ్రామపెద్దలు, ప్రజలను అడిగి తెలుసుకొని, సైబరు నేరాలు, మహిళల భద్రత, రహదారి భద్రత, మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. దత్తత గ్రామాలను సంబంధిత పోలీసు సిబ్బంది వారంలో ఒక రోజు సందర్శించి, గ్రామంలో పరిస్థితుల గురించి తెలుసుకొని, సంబంధిత స్టేషను అధికారులను తెలపాలన్నారు. మహిళా పోలీసులతో వారంలో ఒకసారి సంబంధిత పోలీసు అధికారి సమావేశం నిర్వహించి, గ్రామంలో పరిస్థితులు గురించి ఆరా తీయాలన్నారు. కోర్టు విధులు నిర్వహించే పోలీసుల సిబ్బందితో తరుచూ సమావేశమై, వారి విధులను పర్యవేక్షించాలన్నారు. స్టేషనుకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులను న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి, వారిపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలన్నారు.
దీపావళి, దశరా పండగులు వస్తున్న నేపథ్యంలో అక్రమంగా బాణసంచా తయారీ, విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించుటలో భాగంగా బ్లాక్ స్పాట్లను ఇతర శాఖల అధికారులతో సంయుక్తంగా సందర్శించి, ప్రమాణాల నియంత్రణకు తీసుకోవాల్సిన భద్రత చర్యలను ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలన్నారు. విద్యార్థులను మాదక ద్రవ్యాల ప్రభావానికి గురికాకుండా చేసేందుకు జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమాన్ని అన్ని కళాశాలలో నిర్వహించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి నియంత్రణకు డైనమిక్ వాహన తనిఖీలను షెడ్యూలు ప్రకారం ఆకస్మికంగా నిర్వహించాలన్నారు. విజిబుల్ పోలీసింగును ప్రతి పోలీసు స్టేషను పరిధిలో విధిగా నిర్వహించాలని, తద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవడంతోపాటు, నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఎం.వి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైనా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైనా కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసు స్టేషనులో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ప్రొసీజరు ప్రకారం డిస్పోజ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
దర్యాప్తులో ఉన్న గ్రేవ్,నాన్ గ్రేవ్, ఎస్సీ ఎస్టీ కేసులు, మిస్సింగు కేసులు, అసహజ మరణాల కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తును పరిశీలించి, దర్యాప్తు పెండింగ్ లో ఉండుటకు కారణాలను అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు.
ఇటీవల ముగిసిన లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేసిన, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్సీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి. శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్సైలు, ఆరైలు, ఆర్ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : రౌడీషీటర్ల ప్రవర్తన, నేర చరిత్ర ఆధారంగా వారిపై నిఘా పెట్టాలి )