Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ పేదల పాలిట అక్షయపాత్రగా అన్న క్యాంటీన్లు

 పేదల పాలిట అక్షయపాత్రగా అన్న క్యాంటీన్లు

 పేదల పాలిట అక్షయపాత్రగా అన్న క్యాంటీన్లు

వినుకొండలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

న్యూస్‌తెలుగు/ వినుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అన్నక్యాంటీన్లు పేదల పాలిట అక్షయపాత్రగా అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పేదల కష్టం, ఆకలిబాధ తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే ప్రారంభించిన అన్నక్యాంటీన్లపై కూడా జగన్ కక్షతీర్చుకోవడం దారుణమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. వినుకొండలోని తల్లి పిల్లల వైద్యశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను శుక్రవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. పలువురికి స్వయంగా అల్పాహారం వడ్డించారు. స్థానిక ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే అల్పాహారం తిన్నారు. అనంతరం పలువురు పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పదన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చాటిచెప్పిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అని, ఆయన బాటలో సమాజంలో ఉన్న పేదలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బున్న వాళ్లకి ప్రభుత్వ సహకారం అవసరం లేదని, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారితో పాటు కూలినాలి పనులు చేసుకుంటూ రూ.300, రూ.400, రూ.500 సంపాదించే కార్మికులకు, పేదలకు ఈ అన్న క్యాంటీన్ల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. దాన్ని గుర్తించిన చంద్రబాబు గతంలో తెదేపా ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చారన్నారు. మధ్య జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూసివేయించారని మండిపడ్డారు. జగన్‌ తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఫొటోలు పెట్టుకొని అన్న క్యాంటీన్లు మూసివేయించడం సిగ్గుచేటన్నారు. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. రూ.5కే అన్నం పెట్టి పేదల ఆకలి తీర్చే గొప్ప పథకాన్ని మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు 93% సీట్లు ఇచ్చి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు. ఎన్డేయే ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు, పవన్‌ నిలబెట్టుకున్నారని కొనియాడారు. వినుకొండలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హరేకృష్ణ వంటి ఆధ్యాత్మిక సంస్థలకు అన్న క్యాంటీన్ల బాధ్యతను అప్పగించడం మరో ఆనందదాయకమైన అంశంమని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిజాయతీగా పనిచేసే సంస్థలకు బాధ్యతలు అప్పగించి సీఎం చంద్రబాబు ఎంతో మంచిపని చేశారన్నారు. పూటకు అయిదు రూపాయల చొప్పున 15 రూపాయలతోనే నిరుపేదలు మూడు పూటల కడుపు నింపుకునేలా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు చిరస్థాయిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తన వివాహ దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్‌కు రూ.1,10,116 విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అన్న క్యాంటీన్‌కు ఎప్పుడు అవసరమైనా శివశక్తి ఫౌండేషన్, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సహాయ, సహకారాలు అందించడానికి సంసిద్ధంగా ఉంటామని ప్రకటించారు. అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించే వారందరిని మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నా అన్నారు. ఇదే సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగించాలని సూచించారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో అన్న క్యాంటీన్‌కు రూ.11 వేల విరాళం అందించిన గంగవరపు సురేంద్రను అభినందించారు. వైకాపా అయిదేళ్ల పాలనలో చేసిన ఘోరాలు, ఆకృత్యాలకు ఈ పేదలు ఉసురు కూడా తగిలే జగన్ రెడ్డి, వైకాపా మట్టిగొట్టుకుని పోయారన్నారు. ఇటీవల వరదల సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం ప్రకటించిన చంద్రబాబుకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ పథకాలు అందించడం దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి హయాంలో 100 రోజులు అభివృద్ధితో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వారం రోజులపాటు వివరిస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగ శ్రీను రాయల్, బిజెపి నాయకులు మేడం రమేష్, పట్టణ టిడిపి అధ్యక్షుడు పఠాన్ ఆయభ్ ఖాన్, పీవీ సురేష్ బాబు, షమీంఖాన్, గంధం కోటేశ్వరరావు, వాసిరెడ్డి లింగమూర్తి, గట్టుపల్లి శ్రీనివాసరావు, పువ్వాడ కృష్ణ పలువురు టిడిపి నాయకులు , క్యాంటీన్ నిర్వాహకులు కృష్ట, తదితరులు పాల్గొన్నారు. (Story :  పేదల పాలిట అక్షయపాత్రగా అన్న క్యాంటీన్లు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!