సంక్షేమ పాలనపై ప్రజలకు అవగాహన
కమిషనర్ పి. నల్లనయ్య
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించి, సుపరిపాలన అందిస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజలకు సేవలు అందిస్తుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కొనియాడారు. రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన ప్రభుత్వం 100 రోజులుగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు ఒకటవ డివిజన్ సాకేటి వీధిలో సమావేశాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని తెలియచెప్పే కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి తొలి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత కొనియాడబడుతుందని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ మెగా డీఎస్సీ తో 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం విశేషం అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచి 4000 రూపాయలు ప్రతినెలా ఒకటో తేదీన అందిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం దేశంలోనే సంక్షేమ చరిత్రగా నిలుస్తుందని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇది అని అన్నారు. 1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతలను ఆదుకున్నారని అన్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్ల రూపాయలు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోసారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం 175 అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి 5 రూపాయలకే రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. విజయనగరంలో రెండు చోట్ల అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించడం జరిగిందని గోషా ఆసుపత్రిలో కూడా త్వరలో మరో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించిన ప్రభుత్వం ఇదని అన్నారు. ఈ మధ్యనే విజయవాడ నగరంలో వరదలలో విలవిలలాడుతున్న ప్రజానీకానికి ఎంతో శ్రమకోర్చి నిద్రాహారాలు మాని ఓ తండ్రిలా చంద్రబాబు నాయుడు కాపాడారని అన్నారు. తాము కూడా 150 మంది సిబ్బందితో విజయవాడ వెళ్లి పారిశుధ్య ప్రత్యేక పని చర్యలను చేపట్టామన్నారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలు కనుగుణంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని ప్రజలకు నమ్మకం కలిగిందని అన్నారు. ఈ సమావేశంలో టిపిఆర్ఓ సింహాచలం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : సంక్షేమ పాలనపై ప్రజలకు అవగాహన)