స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి
ప్రతి జిల్లాకు విజన్ డాక్యుమెంట్ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలతో రూపొందించి విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌పై జిల్లా స్థాయిలో వివిధ వర్గాల వారితో చర్చించి వారి అభిప్రాయాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ పంచాయతీ, మండల, మునిసిపాలిటీ, జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లను రూపొందించడం జరుగుతోందన్నారు. వీటిపై సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో ప్రజా ప్రతినిదులు, పారిశ్రామిక, వాణిజ్య, రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నవంబరు 1వ తేదీన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చించారు. సెప్టెంబరు 30 నాటికి మండల స్థాయిలో, అక్టోబరు 15 నాటికి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం కావాలని సి.ఎస్. చెప్పారు. ప్రతి జిల్లాకు అభివృద్ధికి అనుకూలమైన అంశాలను గుర్తించి వాటి ఆధారంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలన్నారు.విజన్ డాక్యుమెంట్ అమలులో భాగంగా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ శాఖ వారీగా భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాల సాధనపై కార్యాచరణ ప్రణాళిక వుండాలన్నారు. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో మత్స్య పరిశ్రమ ద్వారా వృద్ధికి గల అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. బ్లూ ఓషన్ ఎకానమీలో భాగంగా సముద్రంలో లభించే వనరులను వినియోగించుకొని అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవలసి వుందన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, ముఖ్య ప్రణాళిక అధికారి పి.బాలాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story : స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి)