రషీద్ హత్య కేసులో పిటిషన్ దాఖలు చేసిన పొన్నవోలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలో జులై 17న జరిగిన రషీద్ హత్య కేసులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ , వైసీపీ న్యాయ సలహా దారులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. రషీద్ హత్యను నడిపించిన వారి పేర్లును కేసులో పోలీసులు నమోదు చేయలేదన్నారు. ప్రధాన నిందితుల పేర్లను కేసులో నమోదు చేయాలని వినుకొండ జూనియర్ సివిల్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం 11:10 నిమిషాలకు వినుకొండ మేజిస్ట్రేట్ కోర్టుకు చేరుకున్న పొన్నవోలును స్థానిక న్యాయవాదులు కలిశారు. అలాగే రషీద్ కుటుంబ సభ్యులు పొన్నవోలును చుట్టుముట్టి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. న్యాయవాది ఎం.ఎన్.ప్రసాద్, పొన్నవోలును కోర్టు హాల్లోకి తీసుకువెళ్లారు. కోర్టులో పిటీషన్ వేసిన అనంతరం ఆయన క్రిక్కిరిసిన న్యాయవాదులతో, రషీద్ కుటుంబ సభ్యులతో, వైసిపి కార్యకర్తలతో కలిసి బార్ అసోసియేషన్ హాల్ బయట మీడియాతో మాట్లాడారు. వినుకొండలో రషీద్ హత్య అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని, రషీద్ హత్య కేసు ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే. ఈ కేసు తనను చూడమని జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. దీంతో తాను వినుకొండ రావడం జరిగిందన్నారు. రషీద్ హత్య కేసులో ప్రధానంగా మరో నలుగురు ఉన్నారని, ఇద్దరు ప్రధాన కుట్ర దారులుగా ఉన్నారని, పోలీసులు నేటి వరకు వారిని అరెస్టు చేయలేదని అందువలన తాము కోర్టులో పిటిషన్ వేసామన్నారు. ఏ వైసిపి కార్యకర్తకు అన్యాయం జరగకూడదు అని ఆ బాధ్యతలన్నీ జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టారన్నారు. రషీద్ హత్య కేసు పై పోలీసులు విచారణ చేస్తున్నారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా పోలీసులు న్యాయబద్ధంగా పనిచేస్తే స్వాగతిస్తామని మేమెందుకు పిటిషన్ వేస్తామని పొన్నవోలు బదులిచ్చారు. ఈ హత్య కేసు పై మీరు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చారు. అని ప్రశ్నించగా తాను తమ నేత కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్లాను అన్నారు. స్థానిక సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.ప్రసాద్. మాట్లాడుతూ రషీద్ కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేసేందుకే పొన్నవోలు వినుకొండ వచ్చారన్నారు. టిడిపి దారుణాలు మితిమీరిపోయాయని, పోలీసు, అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, రషీద్ హత్యకు కారకులైన వారందరికీ శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తారన్నారు. వీరితోపాటు ముస్లిం మైనార్టీ నాయకులు పిఎస్. ఖాన్, న్యాయవాది సికే రెడ్డి, రషీద్ కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : రషీద్ హత్య కేసులో పిటిషన్ దాఖలు చేసిన పొన్నవోలు)