రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రాచరిక దర్పం తొలిగింపు
కార్యాలయాల్లో స్నేహ, మర్యాదపూర్వక సేవలే లక్ష్యం
స్పెషల్ సీఎస్(రెవెన్యూ) ఆర్పీ సిసోడియా
న్యూస్‌తెలుగు/విజయవాడ (కృష్ణలంక) : రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ, మర్యాదపూర్వక వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పెషల్ సీఎస్(రెవెన్యూ) ఆర్పీ.సిసోడియా తెలిపారు. స్థానిక చుట్టుగుంట సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఉన్న గుణదల రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం సబ్ రిజిస్టార్ ప్రత్యేక పోడియం తొలగింపు కార్యక్రమానికి సీఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ ఎంవీ.శేషగిరిబాబు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు రిజిస్ట్రేషన్ అధికార్లు పోడియం తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజిస్టార్ కార్యాలయాల్లో స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించి మర్యాదపూర్వక సేవలను అందించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాసేవకులనే భావన ప్రజల్లో కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్టార్ పోడియం చూస్తే ప్రజలకు మనం కోర్టులో ఉన్నామనే భావన కలగకుండా ఉండేందుకే మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాచరిక పోకడలు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రజల మనోభావాల్లో కొంత అభద్రత, భయాందోళన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఉందన్నారు. ఉద్యోగులు, అధికారులు సమానత్వంతో క్రయవిక్రయదారులకు ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మర్యాదపూర్వకమైన సేవలను పొందగలుగుతున్నామనే భావన కలుగుతుందన్నారు. ప్రభుత్వానికి ఆధాయాన్ని కల్పిస్తున్న క్రయవిక్రయదారులను ఎంతో మర్యాదపూర్వకంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గత రాచరిక పోకడలకు స్వస్తి పలికేందుకు రిజిస్టార్, సబ్ రిజిస్టార్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనాలు, పోడియంలను తొలగించి ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు కల్పించే తరహా సౌకర్యాలను రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అత్యంత పారదర్శకతను పాటించేలా అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అవినీతి, లంచగొండితనం, నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వస్తే శాఖపరమైన చర్యలను తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో గుణదల జాయింట్ సబ్ రిజిస్టార్లు కే.ప్రసాదరావు, ఎం.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.