ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్‌తెలుగు/విజయవాడ కార్పొరేషన్ : నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సత్వరమే పారిశుధ్య నిర్వహణ పూర్తిచేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర సంబందిత అధికారులను ఆదేశించారు. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన కండ్రిక, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, నున్న, ముస్తాబాద్, తదితర ప్రాంతాల్లో కమిషనర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా అక్కడున్న శానిటరీ ఇనస్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం దగ్గరే ఉండి వ్యర్ధాలను తొలిగించేలా చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరావును ఆదేశించారు. అనంతరం రాజీవ్‌గాంధీ స్కూల్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ స్కూల్‌లో నిర్వహించాల్సిన పారిశుధ్యాన్ని సత్వారమే పూర్తిచేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే పాఠశాలలు, ఆస్పత్రులు ఉంటాయో అక్కడ వెంటనే పారిశుధ్య నిర్వహణ సత్వరం పూర్తి చేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు యుద్ద ప్రాతిపధికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి)