పోషణ మాసమును పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్
న్యూస్‌తెలుగు/ కొమురం భీమ్/ ఆసిఫాబాద్ జిల్లా : పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసమును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ మహిళ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్య, గిరిజన సంక్షేమ శాఖలు, గ్రామీణాభివృద్ధి శాఖ సి. డి. పి. ఓ.లు, సూపర్ వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో చేపట్టిన పోషణ మాసం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఇందులో భాగంగా పసిపిల్లలకు తల్లిపాల ప్రాముఖ్యత, మొదటి 1 వేయి రోజులు శిశు జీవన ప్రయాణం, అనుబంధ పోషక ఆహారం, పౌష్టికాహారం, న్యూట్రి గార్డెన్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,మానసిక, శారీరక ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు అవసరమైన మందులు అందించాలని, పరిశుభ్రత, అదనపు ఆహారం తినిపించడంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు ఆహారం అందించాలని, మెనూ పట్టికను బోర్డుపై ప్రదర్శించాలని, మండల, జిల్లా అధికారులు తరచుగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి మెనూ ప్రకారం ఆహారం అందించని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
శామ్- మామ్ కార్యక్రమంలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు పాల్గొని వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, రక్తహీనత ఉన్న బాలింతలు, గర్భిణుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హిమోగ్లోబిన్ కనీసం 12 గ్రాములు పైగా ఉండేలా అవసరమైన మాత్రలు, పౌష్టిక ఆహారాన్ని అందించాలని తెలిపారు. అనంతరం పోషణ్ అభియాన్ సంబంధిత గూడ ప్రతులను ఆవిష్కరించారు. (Story : పోషణ మాసమును పకడ్బందీగా నిర్వహించాలి )