భారీవర్షాలను ప్రకృతి విపత్తుగా
పరిగణించాలి : డిసిసి తీర్మానం
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ వెల్లడి
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలో ఈనెల 7,8 తేదీల్లో వాయుగుండం కారణంగా కురిసిన భారీవర్షాల ప్రభావం వల్ల రైతులకు పంటనష్టంతో పాటు, పలు ప్రభుత్వ శాఖల ఆస్తులకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిన దృష్ట్యా దీనిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలని కోరుతూ జిల్లా స్థాయి బ్యాంకర్లు, జిల్లా అధికారుల కమిటీ సమన్వయ సమావేశంలో తీర్మానం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, డిసిసి ఛైర్మన్ డా.బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డిసిసి అత్యవసర సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాలో సెప్టెంబరు 8న ఒక్క రోజులోనే 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతోపాటు, వరుసగా రెండు మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో వరి, ఇతర ఉద్యానపంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనితోపాటు రోడ్లు, వంతెనలు, సాగునీటి వనరులు ఇతర ఆస్తులకు నష్టాలు జరిగాయని పేర్కొన్నారు. కోళ్లు వంటి పశుసంపదకు కూడా పలు ప్రాంతాల్లో నష్టం జరిగిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో వుంచుకొని జిల్లాలో కురిసిన వర్షాలను ప్రకృతి విపత్తుగా పరిగణించి తదనంతర చర్యలు చేపట్టాలని కోరుతూ తీర్మానాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు వెల్లడించారు.
జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, లీడ్ జిల్లా మేనేజర్ రమణమూర్తి, నబార్డు ఏ.జి.ఎం. నాగార్జున, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణచక్రవర్తి, సిపిఓ బాలాజీ, వ్యవసాయ శాఖ జె.డి. వి.టి.రామారావు, మెప్మా పి.డి. సుధాకర్, ఉద్యానశాఖ ఏ.డి. జమదగ్ని, హౌసింగ్ పి.డి. శ్రీనివాస్, మత్స్యశాఖ డి.డి. నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతుల రుణాలను ముమ్మరం చేయాలి
జిల్లాలో కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమాన్ని బ్యాంకులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమంపై డిసిసి సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. 2333 మంది కౌలు రైతులకు రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తులు పంపించామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామారావు వివరించారు. వీరందరికీ వెంటనే ఆయా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. (Story : భారీవర్షాలను ప్రకృతి విపత్తుగా పరిగణించాలి : డిసిసి తీర్మానం)