వర్షాలపట్ల అప్రమత్తంగా ఉన్నాం
పరిస్థితి అదుపులోనే ఉంది
వదంతులను నమ్మొద్దు
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
తాటిపూడి రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్
విజయనగరం పట్టణంలో విస్తృత పర్యటన
విజయనగరం, గంట్యాడ, సెప్టెంబరు 08 ః
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా తాటిపూడి రిజర్వాయర్‌ను కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయర్ గరిష్ట సామర్ద్యం 297 అడుగులు కాగా, ఇప్పటికే 295 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తంగా ఉండి,నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్‌ఫ్లో పెరిగి, మరో అర అడుగు నీటిమట్టం పెరిగితే, గేట్లు ఎత్తివేస్తామని నీటిపారుదల అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఇప్పటికే రిజర్వాయర్ దిగువ ప్రాంతాలైన ఎస్.కోట, జామి, గంట్యాడ మండలాల తాశిల్దార్లకు సమాచారాన్ని అందించామని వారు వివరించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తాటిపూడి ఈఈ సీతారామనాయుడు, జెఇ తమ్మినాయుడు, గంట్యాడ తాశిల్దార్ నీలకంటేశ్వరరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జోరువానలో సైతం కలెక్టర్ అంబేద్కర్ విజయనగరం పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా పెద్దచెరువు గట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఎల్ఐసి భవనం సమీపంలోని కల్వర్టును, రోడ్లపై పొంగుతున్న పెద్దచెరువు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నీరు రోడ్డుపైకి రాకుండా తగిన చర్యలు చేపట్టాలని, అవసరమైతే కల్వర్టు వద్ద ఆటంకాలను తొలగించాలని ఆదేశించారు. పద్మావతి నగర్‌వద్ద పొంగి ప్రవహిస్తున్న కాలువను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, ఇతర అధికారులు, తాశిల్దార్ కూర్మనాధరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
వదంతులు నమ్మొద్దు ః కలెక్టర్ అంబేద్కర్
భారీ వర్షాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. పెద్దచెరువు గట్టుకు గండి పడలేదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎక్కడా పెద్దగా ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోలేదని, ప్రస్తుతానికి ఎక్కడా ప్రమాదకర పరిస్తితులు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. మూడు మండలాలు మినహా, మిగిలిన చోట్ల పెద్దగా వర్షాలు కురవలేదని చెప్పారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా, నోడల్ ఆఫీసర్లందరినీ మండలాల్లోనే ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వివిధ శాఖల అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారని తెలిపారు. ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉత్పన్నం అయితే, వెంటనే వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. తాటిపూడి రిజర్వాయర్ దిగువ ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు, వంతెనలు, కాజ్‌వేలు దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాటిపై నుంచి దాటవద్దని సూచించారు. ఎక్కడైనా గండి పడే పరిస్తితి ఉంటే, వాటిని పూడ్చేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. మత్స్యకారులకు కూడా తగిన హెచ్చరికలను జారీ చేశామని కలెక్టర్ వివరించారు. (Story : వర్షాలపట్ల అప్రమత్తంగా ఉన్నాం)