ధర్మవరాన్ని హంద్రీనీవా నీటితో సస్యశ్యామలం చేస్తాం
ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హామీ
దాదులూరు వద్ద చెక్ డ్యాంను పరిశీలించిన శ్రీరామ్, మధుసూదన్ రెడ్డి*
రేగాటిపల్లి, పోతుకుంట, గొట్లూరు, అప్రాచెరువులకు నీరు ఇస్తాం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా నీరు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్, జనసేన నేత మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన దాదులూరు వద్ద ఉన్న చెక్ డ్యాంను పరిశీలించారు. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా నీరు సంవృద్ధిగా వస్తున్న నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గంలోని చెరువులకు నీరందించే విషయంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే శ్రీరామ్, మధుసూదన్ రెడ్డితో కలసి దాదులూరు వద్ద ఉన్న చెక్ డ్యాంను పరిశీలించారు. కుంటిమద్ది చెరువుకు ఇప్పటికే హంద్రీనీవా నీరు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి గంతిమర్రికి నీరు వస్తాయని శ్రీరామ్ అన్నారు. గంతిమర్రి చెరువు నుంచి దాదులూరు చెక్ డ్యాంకు నీరు వస్తాయన్నారు. అక్కడి నుంచి రేగాటిపల్లి, పోతుకుంట, గొట్లూరు, అప్రాచెరువులకు నీరు చేరుతుందన్నారు. హంద్రీనీవా నీటి సరఫరాకు నియోజకవర్గంలో ఎక్కడా అడ్డంకులు లేకుండా చూస్తామన్నారు. గత ఐదేళ్లలో నీరు వచ్చినా.. దానిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఈ సారి అలాంటి పరిస్థితి లేకుండా హంద్రీనీవా ద్వారా వీలైనంత ఎక్కువ నీరు ధర్మవరం నియోజకవర్గానికి తీసుకుంటామని.. ఈ ప్రాంత రైతులకు నీరందించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ధర్మవరాన్ని హంద్రీనీవా నీటితో సస్యశ్యామలం చేస్తాం)