లండన్ పారిపోయే దారిలేక బెజవాడలో జగన్ బురద రాజకీయం
కోర్టు అనుమతి లేనిదే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేని వ్యక్తి చంద్రబాబుపై విమర్శలా?
జగన్ స్వార్థం, ఇసుక మాఫియా, వైకాపా ఆక్రమణలే రాష్ట్రానికి పెనుశాపం: ఎమ్మెల్యే జీవీ
న్యూస్‌తెలుగు/వినుకొండ : మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి లండన్ పారిపోయే దారిలేక వరదల్లో విలవిల్లాడుతున్న బెజవాడ నగరంలో బురద రాజకీయం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నాయకుడంటే ఆపదలో ముందుండి ప్రజలకు అండగా నిలవాలన్న స్ఫూర్తి ని కూడా మరిచిపోయి లండన్ విహార యాత్రకు ఏర్పాట్లు చేసుకున్న వ్యక్తి జగన్ అని దుయ్య బట్టారు. కోర్టు కేసుల కారణంగా పాస్‌పోర్ట్ సీజ్ అయి ఆ పర్యటనకు వీలు కాకపోవడంతో ఆ విషయం బయటకు రాకుండా విజయవాడకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పొద్దుపుచ్చుతు న్న జగన్‌ను ఏం అనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. విజయవాడ వరదలు మానవ తప్పిదం అని, ప్రభుత్వం సహాయ చర్యలు సరిగా లేవంటూ జగన్, వైకాపా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు జగన్ రెడ్డే అని దుయ్యబట్టారు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 2014-19 మధ్య చంద్రబాబు తలపెట్టిన, దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టుల్ని నాశనం చేయడం తప్ప జగన్ రెడ్డి చేసిందేంటని ప్రశ్నించారు. జగన్ ఆ విపరీత పోకడలు, చేసిన పాపాలే ప్రతి జల విపత్తుకు కారణాలుగా నిలిచాయన్నది నిజం కాదా అని నిలదీశారు. 70% పూర్తయిన పోలవరాన్ని, వెలిగొండను అయిదేళ్లు పక్కన పెట్టడం, పట్టిసీమను పట్టించుకోకపోవడం, సాగునీటి ప్రాజెక్టులకు తట్ట మట్టి వేయకపోవడం వంటివన్నీ జగన్ చేసిన మానవ తప్పిదాలే అన్నారు. అవేకాక వైకాపా నేతల ఆక్రమణలు, కాలువ గట్లపై యధేచ్ఛగా మట్టి తవ్వకాలు, నిషేధిత ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం విజయవాడ వరదలకు కారణమైన బుడమేరును తీసుకున్నా అయిదేళ్లుగా వైకాపా నేతలు చేసిన ఆక్రమణలు, కొల్లేరు అనుసంధానం ప్రాజెక్టును అటకెక్కించడం వల్లనే ఇంత తీవ్రమైన ప్రమాదం జరిగిందని… నిజానికి ఈ తప్పిదాలకు విజయ వాడ వరదబాధితులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో
ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ ధ్వంసం చేసిన 5 పడవల్లో 4 పడవలపై వైసీపీ రంగులు ఉండడం దేనికి సంకేతమో సమాధానం చెప్పాలన్నారు. విజయవాడ నగర పరిధిలో బుడమేరు ప్రవహిస్తున్న సుమారు 11 కి.మీ. మేర వైకాపా నేతల కబ్జాల లెక్కలన్నీ త్వరలోనే తేలతాయని హెచ్చరించా రు. భవానీపురం, అజిత్ సింగ్ నగర్, అయోధ్య నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో ప్రవహించే ఈ కాలువ చుట్టుపక్కల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జగన్ కబ్జాలు చెరవిడిపిస్తా మన్నారు. బుడమేరు ఆనుకుని ఉన్న స్థలాలను కబ్జా చేసి, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, అక్రమ లేఅవుట్లు వేసిన గజం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మింది జగన్ రెడ్డి మనుషు లే అన్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. వీటన్నింటికంటే మించి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే బుడమేరు ఆధునీకరణ పనులను ఆపేసి కమిషన్ల కోసం కాంట్రాక్టర్ ను మార్చి 5ఏళ్లు పనులు పూర్తి చేయకపోయినా అతడికి పూర్తి స్థాయి బిల్లులు చెల్లించడాన్ని ఏ తప్పిదం అనాలో కూడా జగన్ చెబితే బావుంటుందన్నారు. 2022లో బుడమేరుకు గండి పడిందని రైతులు మొత్తుకున్నా ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. (Story :లండన్ పారిపోయే దారిలేక బెజవాడలో జగన్ బురద రాజకీయం)