నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ
17 న 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు తప్పక వేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమం లో భాగంగా ఈ నెల 17 న అల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఈ మాత్రలు 1 నుండి 19 ఏళ్ళ మధ్య ఉన్నఅందరి పిల్లలకు వేయడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాత్రల పంపిణీ పై సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో నమోదు కాని పిల్లలకు , కిషోర బాలలకు , అంగన్వాడీ పిల్లలకు, అన్ని పాఠశాలాల్లో , కళాశాలల్లో , వసతి గృహాలలోని పిల్లలకు, వసతి గృహాలలో వంట చేసే వారు కూడా ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. ఏ ఒక్కరైన 17 న వేసుకొనక పోతే మరల 20 వ తేదీన కూడా వేస్తారని, ఈ మాత్రలు భోజనం చేసిన అర గంట తర్వాత వేసుకోవాలని తెలిపారు. ఈ మాత్రలు వేసుకొన్న తర్వాత కొంచం వికారం, వంతులు, నీరసం వంటివి వస్తే రావచ్చునని, అయితే కొద్దిసేపటికే తగ్గిపోతుందని, కంగారు పడవలసిన అవసరం లేదని తెలిపారు. మాత్రల వినియోగం పై విస్త్రుతంగా ప్రచారం గావించాలని, ఐ.సి.డి.ఎస్ ద్వారా, డి.ఈ.ఓ , డి.ఆర్.డి.ఎ ల ద్వారా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని ఆయా అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా నులిపురుగుల నివారణ పై పోస్టర్లు ను ఆవిష్కరించారు.
ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.భాస్కర రావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.అప్పల నాయుడు, రాష్ట్రీయ బాల స్వస్త్ కార్యక్రమం జిల్లా కో ఆర్డినేటర్ డా.సుబ్రహ్మణ్యం, డి.పి.ఓ శ్రీధర్ రాజా, ఐ.సి.డి.ఎస్.పి.డి శాంతకుమారి, జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ కుమార్, ఆర్.ఐ.ఓ భీమ శంకర్, తదితరులు పాల్గొన్నారు. (Story : నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ)