ఆదివాసి మహిళపై అత్యాచారయత్నం
హత్యాయత్నం చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలి
తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆలం కిషోర్
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం /ములుగు : ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆదివాసి మహిళపై మంగళవారం రోజున అత్యాచార యత్నం, హత్యాయత్నం చేసి పాశవీకంగా, క్రూరంగా దాడి చేసిన నిందితుడు ముగ్ధంను,అదే రీతిన కఠినంగా శిక్షించాలని,ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆలం కిషోర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రం ఐటిడిఏ సమీపంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్బంగా కిశోర్ మాట్లాడుతూ సమాజంలో ఆదివాసీలు అనేక రకాల దోపిడీలకు గురవుతున్నారని, ఈ దేశంలో అత్యంత క్రూరంగా అణిచివేయబడే జాతి, ఏదైనా ఉందా అంటే, అది ఆదివాసి జాతినే అని ఆవేదన చెందారు. నేడు ఆదివాసి మహిళలు అమ్మాయిలు, దేశంలో రోజూ ఏదో ఒక రకమైన హింసకు బలవుతూనే ఉన్నారని, చాలావరకు అవి బయటకు రాకుండా, రాజకీయాలు అడ్డుపడతాయన్నారు.ఈ దేశ మూలవాసులు అంటే సమాజంలో చాలావరకు, చులకన భావన కలిగి మనుషులుగా చూసే పరిస్థితి లేదని, వారి భద్రత పట్ల కూడా ప్రభుత్వాలకు ఏవగింపే కలిగి ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దినదిన అభివృద్ధి చెందుతూ ప్రపంచంతో పోటీ పడుతున్నామని, వేదికల మీద గొప్పలు చెప్పుకునే నాయకులకు, ఆదివాసీల మీద ఏమాత్రం పట్టింపు చితశుద్ధి లేదని తెలియజేశారు. అత్యాచారయత్నం, హత్యాయత్నం చేసిన నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణమే కఠినంగా శిక్షించాలని, బాదిత కుటుంబానికి న్యాయం చేసి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో ఆదివాసీలు ఎలాంటి పోరాటానికైనా వెనుకాడరని, ఆదివాసీల గత చరిత్ర గుర్తుంచుకోవాలని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలోతుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పులిసే బాలకృష్ణ, ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బాగట్ల శ్రీకాంత్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గావిడి నాగబాబు, ఆదివాసీ మహిళా సంఘం గౌరవ అధ్యక్షులు బడే సులోచన, ఈసం స్వరూప, బొల్లెం సారయ్య, పాయం భారతమ్మ,జాకా సమ్మక్క,చంద్రమని, గుంటి సరోజన, పలక ముత్తమ్మ, సోయం రత్న,ఆర్కే సుభద్ర, దుగిని ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. (Story : ఆదివాసి మహిళపై అత్యాచారయత్నం)