బాలసాహిత్యంలో శాశ్వతంగా నిలిచే ‘చిన్నోడికి ప్రేమతో’
———– ✍️వేంపల్లె షరీఫ్
పిల్లల్ని పెంచడం ఇవ్వాళ పెద్ద సవాలు. ఎంత చదువుకున్నవారైనా, మేధావులైనా పిల్లల్ని పెంచడం దగ్గర బోల్తా కొడుతున్నారు. నిత్యం పిల్లలతో అంటిపెట్టుకుని వాళ్లకు మంచి చెడులు చెప్పే ఓపిక, తీరిక చాలామందికి ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా పిల్లలు తాము చెప్పింది వినడం లేదని పైగా తిరగబడు తున్నారని తీసుకెళ్లి హాస్టళ్లలో వేస్తున్నారు.
హాస్టల్స్ కూడా ఇవ్వాళ అన్ని రకాల సౌకర్యాలతో చాలా ఖరీదైనవిగా తయారయ్యాయి. పిల్లల్ని పూర్తిగా ఎయిర్ కండిషన్‌లో ఉంచి టయానికింత పౌష్టికమైన తిండి పెడుతూ, ఆట-పాటలు, ఆరోగ్యంతో పాటు చదువునూ నేర్పిస్తూ ఆధునిక ఆవాసాలుగా మారుతున్నాయి. పిల్లలు సైతం కొన్నాళ్లపాటు తమ సొంతిళ్లు ఇవేనేమో అని భ్రాంతి చెందే స్థాయిలో తల్లిదండ్రులకు దూరంగా ఉండిపోతున్నారు. ఇలాంటి పిల్లలు ఎక్కువమందిలో పాఠ్యపుస్తకాల జ్ఞానం తప్ప లౌకిక జ్ఞానం ఉండటం లేదు.అయితే తల్లిదండ్రులకు ఇదేమీ పట్టడం లేదు. ర్యాంకులు, మార్కులు తప్ప వాళ్లేమీ చూసే దశలో లేరు. వాళ్ల పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడి ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించే యంత్రాలుగా మారుతున్నారా.. లేదా.. అన్నది ఒక్కటే లెక్కగా ఉంటోంది.
ఇలాంటి సందర్భంలో ‘చిన్నోడికి ప్రేమతో..’ అనే ఇలాంటి ఒక ఉత్తరాల పుస్తకం కనబడ్డం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ పిల్లల పట్ల బెంగను పెంచుతుంది. హాస్టల్‌లో ఉన్న పిల్లాడి పట్ల ఆప్యాయతతో వారానికి ఒకటి చొప్పున ఏకంగా ఆరేళ్ల పాటు తల్లి రాసిన ఈ ఉత్తరాల్లో కొన్ని విషయాలు కళ్లను తడిచేస్తాయి.ఒకసారి కాకపోయినా మరోసారి ఈ విషయాల్లో కొన్నింటినైనా తమ పిల్లలకు ఏదో ఒక సందర్భంలో తాము చెబుతున్నామా.. అని తమను తాము ప్రశ్నించుకునేలా చేస్తాయి.
చుట్టూ గందరగోళ వాతావరణం ఉంది. పిల్లల్ని పెంచడం అనే సంగతి అలా ఉంచండి.. అసలు మనిషికే తానెలా బతకాలో తెలియడం లేదు.ఉత్తుత్తి ప్రచారాల హౌరులో ఏది మంచో ఏది చెడో తెలియక అందరూ గందరగోళంలో ఉన్నారు. ఇది ఒక అయోమయాల యుగం. ఈ సమయంలో పిల్లలకు దగ్గరుండి ఇంత సరైన జ్ఞానం ఇవ్వడానికి మించిన బృహత్తర కార్యక్రమం తల్లిదండ్రులకు ఏముంటుంది?
కారణాలు ఏవో తెలీదు. పిల్లాడిని హాస్టల్‌లో చేర్చాలి. చేర్చింది. తాను వృత్తిరీత్యా డాక్టరు. నిత్యం బిజీ.ఎంత పనిలో ఉన్నా పిల్లాడి పెంపకం పట్ల బెంగ. కానీ ఏం చేయగలదు. ఇలాంటి పరిస్థితిలో తానేం చేయగలదో ఈ పుస్తకంలోని ఉత్తరాల ద్వారా నిరూపించారు రచయిత్రి డా. ఎ. విజయలక్ష్మి.
నిజానికి దూరంగా ఉన్న పిల్లలకు పెద్దలు పలు సుద్దులతో ఉత్తరాలు రాసే ప్రక్రియ అంత కొత్తేమీ కాదు. గతంలో మనకు జైలు నుంచి కూతురు ఇందిరకు ఉత్తరాలు రాసిన నెహ్రూ గురించి తెలుసు. అలాగే అబ్రహం లింకన్ రాసిన ఉత్తరాల గురించి తెలుసు. అయితే ఆ ప్రక్రియను ఇలా సమర్థవంతంగా ఇప్పుడిలా ఈ ఆధునిక యుగంలో ఉపయోగించు కోవచ్చని తెలియడంలోనే రచయిత్రి విజయం ఉంది.
సెల్‌ఫోన్లు వచ్చాయి.వాయిస్ రికార్డులు వచ్చాయి. వాట్సప్ మెసేజులు,మెయిల్స్ వచ్చాయి. కమ్యూనికేషన్ రంగంలో ఎంత విప్లవం వచ్చినా ఇలాంటి సందర్భంలో దూరంగా ఉన్న పిల్లాడికి ఒక తల్లి రాసే ఉత్తరం ఇచ్చే హాయి ఇంకోటి ఏదీ ఇవ్వలేదని నిరూపిస్తుంది ఈ పుస్తకం. ఈ పుస్తకం ఇటు పిల్లలకు జ్ఞానాన్ని, పెద్దలకు కర్తవ్యనిర్దేశాన్ని ఇవ్వడమే కాదు అటు బాలసాహిత్యానికి కూడా చాలా ఉపకారం చేసింది.
ఇవ్వాళ చూపిద్దామంటే పిల్లలకు తెలుగులో ఒక మంచి సినిమా ఉండటం లేదు. చదివిద్దామంటే పంచతంత్రం, తెనాలి రామకృష్ణ, ఈసఫ్ కథలు వంటి వాటి దగ్గరే ఆగిపోవాల్సి వస్తోంది. ఈ తరం పిల్లల ఆసక్తికి, ఆలోచనకు తగ్గట్టు సరైన తర్కంతో, సందర్భానుసారం కర్తవ్య బోధ చేసే సాహిత్య సృజన జరగడం లేదు. ఆ లోటును ఈ పుస్తకం తీరుస్తుంది.
హాయ్ చిన్నూ, హాయ్ బంగారం, హాయ్ చిన్నోడా, హాయ్ చిన్నులూ అంటూ మొదలయ్యే ఉత్తరాలన్నీ కేవలం నాలుగైదు పేరాలతో చాలా సరళమైన భాషలో, అవసరమైన పదాలతో, అవసరమైన విషయాలను, అవసరమైనంత వరకే చెప్పి ముగుస్తాయి. చివర్లో ‘ప్రేమతో.. అమ్మ’ అని చదవడంతోనే అక్షరాల నిండా అమ్మతనం పరుచుకుని మనసు పరిమళిస్తుంది. పుస్తకంలో రచయిత్రి కొడుకు చిన్నూకే కాదు ఎవరు చదివినా వారికి తమ అమ్మ గుర్తుకొస్తుంది.
ఈ పుస్తకం బాలసాహిత్యంలో గొంతెండుతున్న మనుషులకు ఒక నీటి చుక్క జాడ చెప్పడం వంటిది.జహీరాబాద్‌లో డాక్టర్‌గా ఉంటూ తమ పిల్లాడితోపాటు ఇతర పిల్లల కోసం కూడా నిరంతరం సారస్వత, వైజ్ఞానిక రంగాల్లో కృషి చేస్తున్న డా. ఏ. విజయలక్ష్మి అభినందనీయురాలు. (Story: బాలసాహిత్యంలో శాశ్వతంగా నిలిచే ‘చిన్నోడికి ప్రేమతో’)
#కాపీ_కోసం: 094900 98654 #ధర-రూ250(పోస్టేజ్ తో)