Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు

శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు

శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు

– నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు

– టీటీడీ ఈవో జె.శ్యామలరావు

న్యూస్‌తెలుగు/తిరుమ‌లః శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద బెంగుళూరుకు చెందిన కర్ణాటక కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (KMF) నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో జె.శ్యామలరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబరెటరీ లేదని, ప్రయివేటు ల్యాబరెటరీ సౌకర్యం ఉన్న పరిశీలించలేదన్నారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. ఇందులోని సిబందికి మైసూర్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు.
నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్ డిఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొ.స్వర్ణ లత, బెంగుళూరుకు చెందిన డా.మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశ నిర్ధేశం చేసిందన్నారు. కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు.
ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు. కొత్త టెండర్ షరతు ప్రకారం, డెయిరీలు నెయ్యిలో ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటలపాటు ఎంపిక చేసిన స్టార్టర్ కల్చర్‌తో వెన్నని పక్వానికి తీసుకురావాలన్నారు. ఇంకా డెయిరీలు కావాల్సిన రుచిని పొందడానికి వెన్నను 120 డిగ్రీలు సెంటిగ్రేడ్ లో 2 -5 నిమిషాలు వేడి చేయాలని చెప్పారు. కర్నాటక కోపరేటివ్ మిల్క్ ప్రాడెక్ట్ (నందిని నెయ్యి) ని ఆమోదించి, నేరుగా కంపెనీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఈవో వివరించారు.
అదేవిధంగా, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా టీటీడీ స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాలలో, బెంగుళూరు, వేలూరులలోని సమాచార కేంద్రాలలో సెప్టెంబర్ 2వ తేదీ 50 వేలు, సెప్టెంబర్ 3వ తేదీ 13 వేలు సెప్టెంబర్ 4వ తేదీ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈవో తెలిపారు.
కావున భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పొందవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమి, సివిఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో పద్మావతి, నందిని డైరీ లైజనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!