ఇసుక రవాణాకు వాహన నమోదు తప్పదు
ఉప రవాణా కమిషనర్ మణికుమార్
ఇసుక రవాణాదారులతో డిటిసి, గనులశాఖ డి.డి. సమావేశం
న్యూస్‌తెలుగు/విజయనగరం: జిల్లాలో వినియోగదారులకు ఉచిత ఇసుకను రవాణా చేయదలచిన వాహన యజమానులంతా తమ వాహనాలను రవాణా శాఖ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవలసి ఉంటుందని ఉప రవాణా కమిషనర్ మణికుమార్ చెప్పారు. ఆవిధంగా నమోదు చేసుకున్న వాహనాలకే ఇసుక రవాణాకు అవకాశం వుంటుందన్నారు. జిల్లాలోని ఇసుక రవాణాచేసే వాహన యజమానులతో మంగళవారం రవాణా శాఖ కార్యాలయంలో ఉపరవాణా కమిషనర్, గనులశాఖ జిల్లా అధికారి సిహెచ్.సూర్యచంద్రరావు సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలపై వారికి వివరించారు. ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కూడా వారికి తెలియజేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రవాణాదారులంతా పాటించి వినియోగదారులకు ఉచిత ఇసుకను సులభతరంగా అందించడంలో సహకరించాలని గనులశాఖ అధికారి సూర్యచంద్రరావు కోరారు. (Story: ఇసుక రవాణాకు వాహన నమోదు తప్పదు)