5 నుంచి జిల్లాలో భారీ వర్షాలు
వరద ప్రమాదాన్ని ముందే గుర్తించాలి
అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం
న్యూస్‌తెలుగు/విజయనగరం: ఈ నెల 5 నుంచి 7వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, తాశిల్దార్లు, ఎంపిడిఓలు, ఇరిగేషన్ ఇంజనీర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహ పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మడ్డువలస రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో ఇప్పటికే ఎక్కువగా ఉందని, అందువల్ల ఇప్పటినుంచే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మడ్డువలస ప్రభావిత గ్రామాల్లోనే విఆర్ఓలు రాత్రీపగలూ ఉండి, ఇరిగేషన్ అధికారులను ప్రతీ మూడు గంటలకోసారి సంప్రదించి రిజర్వాయర్ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలుసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాలను కూడా ముందుగానే గుర్తించాలని చెప్పారు. ఛత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయని, రానున్న రెండుమూడు రోజుల్లో నాగావళి నదిలో, తద్వారా తోటపల్లి కాలువల్లో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి మండలాల్లోని 30 గ్రామాలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ఆండ్ర, తాటిపూడి రిజర్వాయర్లలో నీటి నిల్వ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతానికి ఈ రెండు రిజర్వాయర్లలో ప్రమాద పరిస్థితులు లేనప్పటికీ, భవిష్యత్తులో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, అందువల్ల దానికి సిద్దంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తే ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్దంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. త్రాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని ఎంపిడిఓలను ఆదేశించారు. ఎంపిడిఓలంతా ఆయా మండల కేంద్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. అలాగే రిజర్వాయర్ల ప్రభావిత ప్రాంతాల్లోని విఆర్ఓలంతా వారి గ్రామాల్లోనే ఉండి నిరంతరం ప్రవాహాల పరిస్తితులను తెలుసుకొని ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ఒకవేళ వరద పరిస్థితి వస్తే, దానిని కనీసం ఒక రోజు ముందుగానే అంచనా వేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్ఓ ఎస్‌డి అనిత పాల్గొన్నారు. (Story: 5 నుంచి జిల్లాలో భారీ వర్షాలు)