బెజవాడ గజగజ!

0
Vijayawada Floods 2024

బెజవాడ గజగజ!

విజయవాడను వీడని జలప్రళయం
పెరుగుతున్న వరద ముంపు ప్రాంతాలు
తగ్గని బుడమేరు.. కృష్ణా ఉధృతి
రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ నుంచి 11 లక్షల క్యూసెక్కులు విడుదల

న్యూస్‌తెలుగు/విజయవాడ: 20 ఏళ్ల తర్వాత బెజవాడ వరదతో గజగజ వణుకుతోంది. ఏమాటకామాట బాధితులను సకాలంలో ఆదుకోవడంలో ప్రభుత్వ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. మూడు రోజులు గడుస్తున్నా, విజయవాడ నగరం సగభాగం ఇంకా నీటిలోనే తేలియాడుతోంది. ఓవైపు బుడమేరు, ఇంకోవైపు కృష్ణమ్మ వరద తాకిడికి మునిగిపోయాయి. బుడమేరు వరద ఉధృతి తగ్గకపోగా, కృష్ణా నదికి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఫలితంగా సోమవారం నగరంలోని మరి కొన్ని ప్రాంతాలను వరద ముంచేసింది. బుడమేరు వరద కారణంగా శనివారం అర్ధరాత్రి నుంచి జలదిగ్బంధంలో చిక్కకున్న జక్కంపూడి కాలనీ, అంబాపురం, పాయకాపురం, ప్రకాష్‌ నగర్‌, అజిత్‌సింగ్‌ నగర్‌, రామకృష్ణాపురం, నున్న పవర్‌ గ్రిడ్‌, వన్‌టౌన్‌ వించిపేట, పాలఫ్యాక్టరీ ఏరియా, అప్‌ యార్డ్‌ రైల్వే కాలనీ, కేఎల్‌ రావు నగర్‌, సితార సెంటర్‌, ఊర్మళానగర్‌, విద్యాధరపురం ప్రాంతాలు వరద నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. సోమవారం ప్రకాశం బ్యారేజీకి వరద మరింత పెరగడంతో భవానీపురం వైపు భారీగా నీరు ఇళ్లలోకి చేరింది. సోమవారం సాయంత్రానికి 11.37లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. అధికారులు అందజేసిన గణాంకాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 11,43,201 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీని నిర్మించిన నాటి నుంచి ఇంత భారీ స్థాయిలో నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇదొక రికార్డు. 2009 అక్టోబరు 2 నుంచి 13 తేదీల మధ్య ఇదే స్థాయిలో విజయవాడలో వరదలు వచ్చాయి. ఆనాడు అంటే 2009 అక్టోబరు 5వ తేదీన రాత్రి 11 గంటల సమయానికి 11,10,404 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆనాటి రికార్డును బ్యారేజీ ఈనాడు అధిగమించింది. దీంతో రామలింగేశ్వరనగర్‌, యనమలకుదురు ప్రాంతాలలో నదీపరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అన్ని ప్రాంతాల్లో ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆహారం, తాగునీరు అందించాలని కోరుతున్నారు. రెండు రోజుకుగా నీటిలోనే నానుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరద ప్రాంతాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రైవేటు బోట్ల యజమానులు భారీగా డబ్బులు గుంజుతున్నారు. పాల ప్యాకెట్‌ ధరను వందకు పెంచారు. ఇలా ప్రతిదాని ధర పెంచేశారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వరద ముంపు ప్రాంతాలలో సోమవారం సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ పర్యటించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని హెలికాప్టర్ల ద్వారా వరదలో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు కొందరు బాధితులకు ఆహారపొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అరకొర సాయం అందడంపై నిరసన వ్యక్తమవుతోంది. వివిధ పార్టీల నాయకులు మాత్రం నీళ్లలో దిగి కాసేపు ఫోటోలు దిగి నిష్క్రమిస్తున్నారు. కృష్ణానది తీరంలో కృష్ణలంకవైపు గత ప్రభుత్వం కట్టిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లోపభూయిష్టమైన నిర్మాణం కారణంగా లీకేజీలు పెరిగిపోయాయి. యనమలకుదురువైపు కూడా వరద ముంచుకొచ్చింది. యనమలకుదురు శివాలయం నుంచి కరకట్టవైపు వినాయకనగర్‌ వరకూ పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. కాగా, విజయవాడ నగరంలో పెద్ద సంఖ్యలో దుకాణాలు, కార్యాలయాలు మూసివేశారు. మంగళవారంనాడు కూడా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. (Story: బెజవాడ గజగజ!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version